సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను ఉపయోగించుకుని సరికొత్త మోసాలకు తెరలేపారు. ఇప్పటికే వీరి బారినపడిన పలువురు లబోదిబోమంటున్నారు. అచ్చం వాట్సాప్ సంస్థ నుంచి వచ్చినట్లే సందేశం పంపిస్తారు. తమను తాము సాంకేతిక బృందంగా పేర్కొంటారు. ప్రొఫైల్ పిక్లోనూ ఆ సంస్థ అధికారిక లోగో మాదిరిదే ఉంచుతారు. మీ వాట్సాప్ నెంబర్‌కు వచ్చిన ఆరెంకెల పరిశీలన రహస్య సంఖ్య( వెరిఫెకేషన్ కోడ్) ను తమకు పంపించాలని కోరుతారు. వారిని నమ్మి ఆ సంఖ్యను పంపించారో అంతే సంగతులు.
పిన్ నెంబర్ ఉపయోగించుకుని నేరగాళ్లు మీ వాట్సాప్ నెంబర్‌తో వారి ఫోన్/ కంప్యూటర్లో లాగిన్ అవుతారు. వెంటనే మీ వాట్సాప్ పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. వాట్సాప్ ఖాతా డీయాక్టివేట్ అయిపోతుంది. అంతకముందే కొన్ని మోసపూరిత లింక్‌లను పంపించి.. మీ ఫోన్‌ను సైతం హ్యాక్ చేస్తారు. క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరిస్తారు. మీ కాంటాక్టులోని వ్యక్తుల ఫోన్‌నెంబర్లకు డబ్బులు ఇవ్వాలని కోరుతూ సందేశాన్ని పంపిస్తారు.