కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు నవీకరించాలంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా.. అవి పచ్చి మోసమని గ్రహించండి. సైబర్ నేరస్థులు నెట్‌బ్యాంకింగ్ ఖాతాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. నాలుగురోజుల్లో 8 మంది నుంచి రూ.9.65 లక్షలు స్వాహా చేశారు. సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారని, వారికి ఎలాంటి వివరాలు చెప్పకూడదని తెలిసినా ఒక విశ్రాంత డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ మూడురోజుల క్రితం రూ.90 వేలు పోగొట్టుకున్నారు
అప్‌డేట్ పేరుతో...
హైదరాబాద్‌లో ఉంటున్న ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కొద్దిరోజుల క్రితం సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ వినియోగిస్తున్న మీ వివరాలు నవీకరించాలన్నాడు. 3 రోజుల క్రితమే రూ.645లతో రీ-ఛార్జీ చేయించానని, అప్పుడు చిరునామా, పేరు అప్‌డేట్ చేశామని విశ్రాంత అధికారి చెప్పారు. ‘మీరు స్థానికంగా చేసుంటారు.. టెలికాం సర్కిల్ కార్యాలయానికి వివరాలు కావాలి. సింపుల్‌గా అంతా మీరే చేసుకోండి’ అంటూ ఓ యాప్‌ను మాజీ అధికారితో డౌన్‌లోడ్ చేయించాడు. పదిరూపాయలు రుసుం చెల్లించండి అంటూ ఒక బ్యాంక్ ఖాతా నంబరు చెప్పాడు. విశ్రాంత ఐపీఎస్ పిన్ సహా వివరాలన్నీ ఆ యాప్‌లో నమోదు కావడంతో వాటి ద్వారా రూ.49వేల చొప్పున ఐదుసార్లు రూ.2.45 లక్షలు నగదు లాగేశాడు. బాధితుడు వెంటనే సైబర్ క్రైం వారిని సంప్రదించారు. వారు నెట్‌బ్యాంకింగ్ ప్రతినిధులను అప్రమత్తం చేసి రూ.1.95లక్షల నగదు సైబర్‌నేరస్థుడి ఖాతాలోకి వెళ్లకుండా నిలపగలిగారు.
* బంజారాహిల్స్‌లో ఉంటున్న లక్ష్మణ్ యాదవ్ నుంచి రెండు రోజుల క్రితం రూ.లక్ష తీసుకున్నారు. ఎయిర్‌టెల్ సిమ్‌కార్డు అప్‌డేట్ చేస్తే.. ఆరునెలలపాటు రూ.200 ఉచితటాక్‌టైమ్ వస్తుందని చెప్పారు.
* బేగంపేటలో నివాసముంటున్న ఒక మహిళా ఐటీ కన్సల్టెంట్‌కు మూడు రోజుల క్రితం సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. జియో నెట్‌వర్క్ ప్రతినిధిని అని చెప్పాడు. మీ పేరు, వివరాలు తప్పుగా ఉన్నాయి. రూ.10 చెల్లించి నవీకరించాలని ఒక లింక్ పంపాడు. ఆమె లింక్‌ను క్లిక్ చేయగానే.. ఆమె ఖాతాలోంచి రూ1.52 లక్షలు కొట్టేశాడు.
పది రూపాయలు చాలు అంటూ..
కేవైసీ అంటే తగిన వివరాలు తీసుకొని ఈ ఖాతాదారు తనకు తెలుసు అని సంబంధిత సంస్థ నిర్ధారించడం. బ్యాంకులు సహా పలు సంస్థలు ఈ ప్రక్రియను తప్పనిసరి చేశాయి. ఇది పూర్తయితేనే పూర్తి సేవలు అందుతాయి. దీనిని అవకాశంగా మలచుకొని సైబర్ నేరస్థులు చెలరేగిపోతున్నారు. సెల్‌ఫోన్ వివరాలు నవీకరించాలంటూ ఫోన్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ పద్ధతుల్లో చేస్తామని చెప్పి పది రూపాయలు పంపించేందుకు ఒక లింక్ పంపుతున్నారు.