‘కొవిడ్-19 సమాచారాన్ని తెలుసుకోండి’ అంటూ మీ సెల్‌ఫోన్లకు సందేశాల రూపంలో ఏవైనా లింకులు వస్తున్నాయా? వాటిపై ట్యాప్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పొరపాటున ముట్టుకుంటే బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయిపోవచ్చు. సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడ ఇది.
డబ్బులు కాజేస్తారిలా..
- కొవిడ్-19 పదజాలంతో సెల్‌ఫోన్‌కు సందేశాల రూపంలో లింక్ పంపిస్తారు. సమగ్ర సమాచారం కోసం ఆ లింక్‌పై ట్యాప్ చేయాలంటారు.
- దాన్ని ట్యాప్‌చేస్తే సెల్‌ఫోన్లోకి ఓ మోసపూరిత యాప్ (స్పైవేర్) వచ్చి పడుతుంది. దాంతో ఫోన్ వాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్ బ్యాంకింగ్ యాప్, లేదా బ్రౌజర్‌తో నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయితే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరుతాయి. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలనూ ఈ స్పైవేర్ కాజేస్తుంది. దాంతో సైబర్ నేరగాళ్లు ఖాతాలు కొల్లగొడతారు.
- క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, వాటి సీవీవీ తదితర వివరాలను సెల్‌ఫోన్లలో సేవ్ చేస్తే ఆ వివరాలను సైబర్ నేరగాళ్లు కాజేసి.. డబ్బులు దోచుకుంటారు.