తెలంగాణ

telangana

ETV Bharat / state

Bitcoin Fraud: బిట్​కాయిన్ కొంటే లాభాలంటారు... ఆపై దోచేస్తారు! - తెలంగాణ వార్తలు

బిట్‌కాయిన్‌ (Bitcoin Fraud) కొంటే రోజూ లాభాలొస్తాయ్‌ మీ తరఫున లావాదేవీలు మేం నిర్వహిస్తాం... మీరు అమెరికన్‌ డాలర్లలో మదుపుచేసిన డబ్బును ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ... సైబర్‌ నేరస్థులు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారులు, ప్రైవేట్‌ కంపెనీల ఉన్నతాధికారులపై లాభాల వల విసురుతున్నారు. తొలుత లక్షల్లో లాభాలొస్తాయని నమ్మించి కోట్లు కొట్టేస్తున్నారు.

bitcoin
బిట్​కాయిన్

By

Published : Nov 26, 2021, 5:07 AM IST

బిట్​కాయిన్ కొంటే లాభాలంటారు... ఆపై దోచేస్తారు!

సైబర్‌ నేరస్థులు (Cyber Crime) పంథా మార్చి ప్రజలను వంచిస్తున్నారు. మెట్రోనగరాలతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి ఫోన్‌ నంబర్లు తెలుసుకుని వారిని తమ వాట్సాప్‌ బృందాల్లోకి చేర్చుకుంటున్నారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మిస్తున్న అక్రమార్కులు వాటిని బాధితులు తీసుకున్నాక కోట్లు (Bitcoin Fraud) కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌.. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో నెలరోజుల్లోనే 9 కోట్ల నగదు కాజేశారు. దిల్లీ, ముంబయి కేంద్రాలుగా బిట్‌కాయిన్‌ల పేరుతో సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారని పోలీస్‌ అధికారులు తెలిపారు.

వాట్సాప్ గ్రూప్​లు..

క్రిప్టోకరెన్సీ (Crypto Currency) అర్థం వచ్చేలా మూడువేల మంది సభ్యులతో వాట్సాప్‌ గ్రూప్‌లను రూపొందిస్తున్నారు. నేరస్థులు, వారి అనుచరులు వాట్సాప్‌ చాట్‌ల ద్వారా క్రిప్టోకరెన్సీ కొంటే రోజూ లాభం వస్తుందటూ సంభాషిస్తారు. బిట్‌కాయిన్‌ (Bitcoin Fraud) లావాదేవీల చిత్రాలను పోస్ట్‌చేసి ఇతరుల్ని ఆకర్షిస్తారు. ఇదేదో బాగుందనుకుని వాట్సాప్‌ బృందాల్లో సభ్యులు తామూ కొంటామని చెబుతున్నారు. అప్పుడు అసలు కథను సైబర్‌ నేరస్థులు ప్రారంభిస్తున్నారు. బిట్‌కాయిన్‌ క్రయవిక్రయాలకు యాప్‌లు ఉండాలని చెబుతున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి పేరిట ఓ డిజిటల్‌ ఖాతాను సైబర్‌ నేరస్థులు ప్రారంభిస్తున్నారు. ఈ డిజిటల్‌ ఖాతా నియంత్రణ అంతా నేరస్థుల చేతుల్లోనే ఉంటుంది.

బిట్​కాయిన్​తో పేరిట ఫోన్లు...

తొలుత లక్ష నగదుతో బిట్‌కాయిన్‌ (Bitcoin Fraud) కొనిపిస్తారు. బాధితుడి డిజిటల్‌ ఖాతాలో రూ. లక్ష నగదు కనిపిస్తుంది. మరుసటిరోజు మీకు రూ. 5వేలు లాభం వచ్చిదంటూ చెబుతారు. అందులో రూ. లక్షా 5 వేల సొమ్ము జమవుతుంది. మూడోరోజు ఫోన్‌ చేసి రూ. 15వేలు లాభం వచ్చింది విత్‌డ్రా చేసుకోండి అంటూ వివరిస్తారు. లాభం తీసుకున్నాక ఇక లక్షల్లో మదుపు చేసి కోట్లల్లో లాభాలు పొందండి అంటూ ఫోన్లు చేస్తూనే ఉంటారు. బేగంపేటలో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇటీవల క్రిప్టో కరెన్సీ (Crypto Currency) నేరస్థుల వలలో పడి రూ. 63లక్షలు పోగొట్టుకున్నాడు. బిట్‌కాయిన్‌ పేరిట వచ్చే ఫోన్లకు ఆకర్షితులు కావొద్దని క్రిప్టో కరెన్సీ పేరుతో ఉన్న వాట్సాప్‌ బృందాల్లో చేర్చితే వెంటనే బయటకు రావాలని సైబర్‌ పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:rakesh tikait in hyderabad: 'భాజపాకు ఎవరూ ఓటేయొద్దు.. తెరాస వైఖరి సరిగా లేదు'

ABOUT THE AUTHOR

...view details