Cyber Fraud: వ్యాపారంలో వచ్చిన లాభాలు దాచుకుంటే ఏం లాభం.. మా సంస్థకు ఇస్తే కొన్ని రోజుల్లోనే రెట్టింపు చేస్తాం. ఇప్పటికే ఎంతో మంది మా వల్ల రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా వాట్సప్, ఫోన్ ద్వారా సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో మోసాలు జరిగేవి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ కంపెనీలు తెరిచిన మాయగాళ్లు.. దళారులను ఏర్పాటు చేసుకొని కొత్త తరహా దందా ప్రారంభించారు. నగరంలో మకాం వేసిన కేటుగాళ్లు.. తాము ఎవరనేది బయటకు రానీయకుండా గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా బాధితులు రూ.5 కోట్ల మేర నష్టపోయినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
రూ.2 లక్షలిస్తే.. రెండు రోజుల్లో రూ.3.5 లక్షలు: మోసగాళ్లు క్రిప్టో కరెన్సీ.. బంగారం, అంతర్జాతీయంగా క్రిప్టో, జాతీయంగా బంగారం ధర పెరుగుదలతో లాభాలే లాభాలంటూ జనాన్ని ఊరిస్తున్నారు. రూ.2 లక్షలిస్తే రెండు రోజులకే రూ.3.5 లక్షలు అని, మీకు తెలిసిన వారిని సభ్యులుగా చేర్పిస్తే దానికి సంబంధించి కమీషన్ కూడా వస్తుందని చెబుతున్నారు. వృత్తి నిపుణులు, వ్యాపారులు, సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని దళారులు చెబుతున్న మాటలివి. అయితే ఇవన్నీ నిజమేనని భావించిన ఎంతో మంది వాళ్ల కష్టార్జితాన్ని క్షణాల్లోనే నష్టపోతున్నారు.
కొద్దిరోజులుగా బేగంబజార్, సనత్నగర్, అమీర్పేట్, అబిడ్స్ ప్రాంతాల్లో మకాం వేసిన మోసగాళ్లు.. 1 నుంచి 2 శాతం వరకు కమీషన్ ఇస్తామంటూ దళారులను ఏర్పాటు చేసుకున్నారు. పోగొట్టుకున్న డబ్బులకు సరైన ఆధారాలు చూపలేక కొందరు మౌనంగా ఉండిపోతున్నారు. మరి కొందరు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.