లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ క్రైం పోలీసులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. బ్యాంక్ అధికారులమంటూ తార్నాకకు చెందిన సుబ్బరాయుడు అనే ఖాతాదారుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఏటీఎం కార్డు కేవైసీ అప్డేట్ చేయాలని.. అందుకు ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకొమ్మని చెప్పారు. వాళ్లు చెప్పిన యాప్ డౌన్‌లోడ్ చేసిన సుబ్బారాయుడు.. తన వద్ద ఉన్న 2 ఏటీఎం కార్డుల వివరాలు నమోదు చేశాడు. వెంటనే అతని ఖాతా నుంచి నుంచి 10 లక్షల నగదు మాయమైంది. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమ పేరుతో 38 లక్షలు స్వాహా...
నగరానికి చెందిన ఓ మహిళ నుంచి ప్రేమ పేరుతో సైబర్ చీటర్స్ 38 లక్షలు కాజేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సురేఖను.. యూకేలో వైద్యుడినని సైబర్ నేరగాడు పరిచయం చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపాడు. అది వాట్సాప్ ఛాటింగ్ వరకూ వచ్చింది. ఖరీదైన బహుమతి పంపిస్తానంటూ డాక్టర్ హెర్మన్ పేరుతో సందేశం పంపాడు. రెండు రోజుల తర్వాత దిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారినంటూ సురేఖకు ఫోన్ చేశాడు. డాలర్స్ పార్సిల్ వచ్చిందని.. టాక్స్ చెల్లించి తీసుకోవాలని చెప్పాడు. గుడ్డిగా నమ్మిన బాధితురాలు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌కమ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ.. పేరుతో 38 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారు. ఆ తర్వాత సైబర్ చీటర్ ఫోన్ స్విచ్ఛాఫ్ కాగా.. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేశారు.
అల్పాహారం కావాలంటూ 60 వేలు...
తమ కంపెనీ ఉద్యోగులకు అల్పాహారం సరఫరా చేయాలంటూ మరో సైబర్ మోసం జరిగింది. టోలిచౌకి గుల్షన్‌నగర్ కాలనీకి చెందిన ప్రవీణ అనే మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఖాతా వివరాలు పంపిస్తే అడ్వాన్స్ పంపిస్తానని చెప్పారు. ఖాతా వివరాలు సేకరించిన సైబర్ చీటర్స్.. ఫోన్‌కు క్యూఆర్ కోడ్ పంపించాడు. దాన్ని క్లిక్ చేయగానే ఆమె ఖాతా నుంచి 60 వేల నగదు మాయమైంది. ఖంగుతిన్న మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.