తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లు రవిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు - సునీల్ కనుగోలు వాంగ్మూలం

case registered against Mallu Ravi : మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కనుగోలు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మల్లు రవిని ఏ5 నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఇదివరకే 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు.

Mallu RAVI
Mallu RAVI

By

Published : Jan 11, 2023, 1:19 PM IST

case registered against Mallu Ravi : ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై అభ్యంతరకర రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్‌ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్​క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కనుగోలు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయగా.. మల్లు రవిని ఏ5 నిందితుడిగా చేర్చారు.

ఇదివరకే మల్లు రవికి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ సీసీఎస్‌ విచారణకు హాజరైన మల్లు రవి.. నిర్దేశించిన తేదీలోనే రావాలని సైబర్ క్రైం పోలీసులు వెనక్కి పంపించారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ గళం పేరిట వీడియోలు పోస్టు చేశారన్న ఆరోపణలపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వ్యవహారంలో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసభ్యకర రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 14న సైబర్​ క్రైమ్‌ పోలీసులు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సునీల్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సునీల్‌ కనుగోలుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులను సవాల్‌ చేస్తూ.. సునీల్‌ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం సునీల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. పోలీసులు అరెస్టు చేయవద్దని.. 8న సునీల్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు మంగళవారం విచారణకు రావాల్సి ఉండగా.. ప్రత్యేక అభ్యర్థనతో బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ముందుకొచ్చారు. నేతలను కించపర్చటంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం, కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో లభ్యమైన సమాచారం మేరకు పోలీసులు సునీల్‌ను ప్రశ్నించారు.

దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు. సునీల్‌ కనుగోలు విచారణ ముగిసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా సునీల్ కనుగోలు వాంగ్మూలం ఆధారంగా మల్లురవిపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details