ఆశ కల్పించి.. అందినంత దోచేసి
సేవల పేరుతో ఎవరైనా ఫోన్‌లు చేస్తే.. సమస్యలను పరిష్కరిస్తామని.. ఓటీపీలు, లింక్‌లను పంపించమని సైబర్ కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు.
Hyderabad cyber crime cases latest news
భాగ్యనగరంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే...మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చుపోతున్నారు. ఆశ చూపించి అందినంత దోచేసుకుంటున్నారు. బుధవారం నగర సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులివి.
- రాజస్థాన్‌కు చెందిన స్నేహితులు అంబర్‌పేటలో నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం ‘ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్’ పేరుతో అంతర్జాలంలో వచ్చిన ప్రకటనలో మారుతి స్విఫ్ట్ కారును చూశారు. రూ.1.40లక్షలు అమ్మకానికి పెట్టగా ఆ పోస్టు చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. తాను ఆర్మీ అధికారిగా పరిచయం తీసుకున్నాడు. మీరుంటున్న ప్రాంతానికే కారు పంపిస్తానని ముందుగా నగదు పంపించాలని సూచించారు. దీంతో రెండు దఫాలుగా రూ.43 వేలు చెల్లించారు.
- సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో ఓ కారు చూశారు. కొనుగోలు చేసేందుకు రూ.1.30 లక్షలు ఒప్పందం చేసుకున్నారు. రూ.75 వేలు వారి బదిలీ చేశారు. అదే ప్రాంతానికి చెందిన మరోవ్యక్తి కూడా రూ.58వేలు ఖాతాలో వేసి మోసపోయారు.
- బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్ యాప్‌లో స్కూటీ వాహనాన్ని కొనుగోలు చేయాలని రూ.23 వేల వాహనానికి రూ.43వేలు ఖాతాలో వేశారు.
- డిష్ టీవీ రిఛార్జ్ కోసం ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా చరవాణికి పంపిన లింక్‌ను ఓపెన్ చేసి రూ.15,700 పోగొట్టుకున్నారు.
- ఇంటికే మద్యం పంపిస్తామని చెప్పగా నమ్మి మరో వ్యక్తి రూ.9వేలు మోసపోయారు.