తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైవర్‌ తాగి ఉన్నాడని తెలిసీ వాహనంలో ప్రయాణిస్తే కేసు తప్పదు

తాగి వాహనాలు నడపొద్దని ఎంత చెప్పినా కొందరు వినకుండా వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారే కాదు వారితో పాటు ఉన్నవారినీ ప్రమాదంలో పడేస్తున్నారు. తాగి వాహనాలు నడిపే వారితో పాటు డ్రైవర్​ తాగి ఉన్నాడని తెలిసి.. వాహనం ఎక్కిన వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.

By

Published : Mar 11, 2021, 5:25 PM IST

cybarabad traffic police implement new rule for drunk and drive
డ్రైవర్​ పైనే కాదు ప్రయాణికులపై కూడా కేసు నమోదు!

మద్యం సేవించి వాహనం నడిపే వాళ్లపైనే ఇప్పటి వరకు కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు... ఇకనుంచి ఆ వాహనంలో కూర్చున్న వారి మీద కూడా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 188ని ప్రయోగిస్తున్నారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి... ఏమాత్రం పట్టించుకోకుండా అదే వాహనంలో కూర్చొని ప్రయాణిస్తే చట్టరీత్యా నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో డ్రైవర్ మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలితే అతనిపై వెంటనే కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకుంటున్నారు. అందులో ఉన్న ప్రయాణికులకు డ్రైవర్ తాగి ఉన్నాడన్న విషయం తెలిస్తే.. వాళ్లపైనా చట్టప్రకారం కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుందని.. ప్రమాదాలు జరగడానికి మద్యం కూడా ఒక కారణంగా ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.

ఈ తరహా ప్రమాదాలను నివారించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోజు తనిఖీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక ప్రయాణికులపైనా కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తుండటంతో.... డ్రైవర్ స్థితిగతులను తెలుసుకొని వాహనంలో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా పార్టీలు చేసుకున్న తరువాత అంతా కలిసి వెళ్లే స్నేహితులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు.

ABOUT THE AUTHOR

...view details