CWC Meeting Hyderabad 2023 Ended :హైదరాబాద్‌లో రెండోరోజు జరిగినకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) విస్తృత స్థాయి సమావేశంలో.. రానున్న5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు సహా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, .. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తమ ముందు చాలా సవాళ్లు ఉన్నాయని.. అవి కేవలం హస్తం పార్టీకి చెందినవి మాత్రమే కాదని.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
Mallikarjuna Kharge On CWC Meeting :భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సవాళ్లని మలికార్జున ఖర్గే (Malikarjuna Kharge) వివరించారు. రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆర్నెళ్లలో లోక్‌సభ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్ సమరానికి సన్నద్ధం కావాలని నేతలకు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. సామాజిక న్యాయం, సంక్షేమంలో కొత్త నమూనాతో విజయవంతమయ్యాయని.. వాటిని దేశమంతటా ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
CWC Meeting Details :ఇది పరీక్షా సమయమని మలికార్జున ఖర్గే తెలిపారు. పదేళ్ల బీజేపీ హయంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లు పెరుగుతూ పోతున్నాయని వివరించారు. అన్ని వర్గాల సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ తరుణంలో కలసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలు పక్కనపెట్టి పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమించాలని కాంగ్రెస్ నేతలకు మార్గనిర్దేశం చేశారు. సంస్థాగత ఐక్యత అత్యంత కీలకమని... కర్ణాటకలో అది ఫలించిందని మలికార్జు ఖర్గే గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుందని ఆపార్టీ నేత చిదంబరం (Chidambaram) పేర్కొన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సత్ఫలితాలు ఇచ్చిందన్న ఆయన.. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడే నిర్వహించటం కలిసి వచ్చే అంశమన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను నేతలు సమావేశంలో వివరించారు. తమ ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అగ్రనేతలు తమ రాష్ట్రాల్లో పర్యటించాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.