తెలంగాణ

telangana

ETV Bharat / state

CS SOMESH KUMAR: 'లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి' - telangana rains news

రాష్ట్రంలో కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాలపై సీఎస్​ సోమేశ్​కుమార్​ అధికారులతో సమీక్షించారు. ఉత్తర తెలంగాణలో భారీ వానలు పడుతున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్​లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

CS SOMESH KUMAR: 'లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి'
CS SOMESH KUMAR: 'లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి'

By

Published : Aug 30, 2021, 7:03 PM IST

రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ ఆదేశించారు. డీజీపీ మహేందర్​రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి బీఆర్కే భవన్ నుంచి సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు సమీక్షకు హాజరయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎస్ ఆదేశించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్​లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారీ నుంచి అతి భారీ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రదేశాల్లో పడుతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎడతెరిపిలేని వర్షం..

రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చెరువులు మత్తడి పోస్తుండగా పలుచోట్ల పంటలు నీటమునిగాయి. వాగుల ఉద్ధృతి భారీగా పెరగడంతో రాష్ట్రంలో రెండు చోట్ల కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఓ చోట నవవధువు సహా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోచోట ఓ దివ్యాంగుడు కారుతో సహా కొట్టుకుపోయి... శవంగా బయటకొచ్చాడు.

వికారాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల జిల్లాల్లో వాగులు పొంగాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఆదివారం 13.82 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బస్వాపూర్ వంతెన పైనుంచి నీరు దూకుతుండగా.. హన్మకొండ- సిద్దిపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ప్రవాహంలో చిక్కుకోగా.. స్థానికులు డ్రైవర్‌ను రక్షించారు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం కుర్రారం వాగులో ఇద్దరు యువతులు గల్లంతు కాగా... ఒకరి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు.

WEATHER REPORT: రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

RAINS: ఎడతెరిపి లేని వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ABOUT THE AUTHOR

...view details