గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దిల్లీ పర్యటనలో ఉన్న సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌గా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పోలీస్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పని చేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, తెగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.
ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చూడాలి..
ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని సోమేశ్‌కుమార్ వివరించారు. వాగులు, వంకల నుంచి వరద నీరు ప్రవాహ సమయంలో ప్రజలు, వాహనాలు వాటిని దాటకుండా ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలన్న సీఎస్.. చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభం..
మరోవైపు గులాబ్ తుపాను(Tropical Cyclone Gulab) తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి(Kalingapatnam) 25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. తుపాను తీరం దాటే వేళలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.