తెలంగాణ

telangana

ETV Bharat / state

'వానాకాలం పంట కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి'

ఈ ఖరీఫ్ సీజన్​లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ అధికారులను ఆదేశించారు. పంట కొనుగోళ్ల ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

cs somesh kumar tele-conference with collectors
'వానాకాలం పంట కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి'

By

Published : Sep 24, 2020, 7:38 PM IST

ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ అధికారులను ఆదేశించారు. వానా కాలం పంట ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అశ్వినీ కుమార్, ఇతర ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2020-21 వానా కాలంలో 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైన దృష్ట్యా.. పెద్ద ఎత్తున వచ్చే ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గన్నీ బ్యాగులు సమకూర్చుకోవడం ఇతర ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

సీఎంఆర్​లో జాప్యం వద్దు

వానా కాలంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కస్టమ్​ మిల్లింగ్ రైస్-సీఎంఆర్‌ ఈనెల 30లోగా.. యాసంగి సీజన్ కోసం అక్టోబరు 20లోగా పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. సీఎంఆర్‌లో జాప్యం జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, ఇది దృష్టిలో ఉంచుకుని తక్షణమే రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, కనీస మద్దతు ధరలకు ధాన్యం అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎస్ సమీక్షించారు. సీఎంఆర్ అప్పగించడానికి ఎదురవుతోన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ మేరకు గోదాముల్లో నిల్వ సమస్య లేకుండా, సీఎంఆర్ క్లెయిమ్స్ చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్‌ను ఆదేశించారు.

ఇదీచూడండి:మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details