CS Somesh Kumar On Heatwave: రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. తీవ్రఎండల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీ రాజ్, విద్యా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ మాణిక్ రాజ్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఎండతీవ్రత అధికం: రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.