CS Meeting With Employees: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా నెలాఖరులోగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియపై అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఉద్యోగుల సీనియారిటీ నిర్ధరణ, జిల్లాలకు కేటాయింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఇందుకు సంబంధించి అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని... రేపట్నుంచి ఐచ్ఛికాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్‌ను కోరామన్న టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్... భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా చూడాలని కోరినట్లు చెప్పారు. సీఎస్ ఇందుకు సానుకూలంగా స్పందించారని అన్నారు. జిల్లా కేడర్ స్థాయి పోస్టులతో పాటే జోనల్ పోస్టుల విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పారు.