CS on Fever Survey: రాష్ట్రంలో ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ -19 మూడో విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్లు సీఎస్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్‌లోని హిల్‌టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, తదితర అధికారులు ఆయనతో పాటు పరిశీలించారు. కరోనా మూడో వేవ్‌తో గానీ, ఒమిక్రాన్‌తో గానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎస్ అన్నారు. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కొక్క టీమ్‌లో ఆశా, ఏ.ఎన్.ఎం, మున్సిపల్, పంచాయతీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కొవిడ్ లక్షణాలు ఉంటే మెడికల్ కిట్‌ను అందజేస్తారని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుతో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైందని సీఎస్ అన్నారు.
ఒక వారం రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం. దీనివల్ల వ్యాక్సినేషన్ గురించి కూడా వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలి. కొవిడ్ లక్షణాలుంటే 5 రోజుల మందుల కిట్ అందజేస్తాం. కోటి మందుల కిట్‌లు సిద్ధంగా ఉంచాం. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నాం. -సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి