ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆదేశాల మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని 20 జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ (Cs Somesh kumar Tele Conference) నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై సీఎస్ ఆరా తీశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.
ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి జిల్లాల్లోని అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండిన నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా చెరువుల కట్టలు పటిష్టంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలని సోమేశ్ కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమైన జలాశయాలు, చెరువులు, కుంటల పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.