Telangana New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవనం ఈనెల 30న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అందులోకి కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ముఖ్య సలహాదారు కార్యాలయాలు ఉన్నాయి.
Telangana New Secretariat Inauguration : కింది అంతస్తు మొదలుకొని ఐదో అంతస్తు వరకు మంత్రులవారీగా ఛాంబర్లను ఇప్పటికే కేటాయించారు. వారికి అనుబంధంగా ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, విభాగాలకు ఛాంబర్లు, గదులు, వర్క్ స్టేషన్లను కేటాయించారు. దిగువ అంతస్తులో రెవెన్యూ, ఎస్సీ అభివృద్ధి శాఖలకు కేటాయింపు చేశారు. మొదటి అంతస్తులో విద్య, హోం, పంచాయతీరాజ్.. రెండో అంతస్తులో ఆర్థిక, వైద్యారోగ్య, పశుసంవర్ధక శాఖలకు కేటాయింపు చేశారు. పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖలను మూడో అంతస్తులో.. న్యాయ, పర్యాటక, నీటిపారుదల శాఖలకు నాలుగో అంతస్తులో కేటాయింపు చేశారు. రహదార్లు-భవనాలు, రవాణా శాఖకు ఐదో అంతస్తులో కేటాయింపు చేశారు.
ఆయా శాఖల్లోని అధికారులకు ప్రత్యేక బాధ్యతలు:శాఖలవారీ కొత్త సచివాలయంలోకి తరలింపు ప్రక్రియ కోసం ఒక్కో శాఖకు ఒక్కో సమయాన్ని కేటాయించారు. కేవలం దస్త్రాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలను మాత్రమే నూతన భవనంలోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫర్నీచర్‌ను కొత్త సచివాలయంలోకి తరలించవద్దని ఆదేశాలు జారీ చేశారు. తరలింపు ప్రక్రియ కోసం ఆయా శాఖల్లోని అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. తరలింపు ప్రక్రియ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ ఇవాళ ఉదయం పది గంటల నుంచి విధుల్లో ఉండాలని ఆదేశించారు. తరలింపునకు అనుగుణంగా ప్యాకింగ్, తదితర ప్రక్రియలు ప్రారంభించాలన్నారు. ఈ నెల 28 నాటికి తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 30న సచివాలయం ప్రారంభించే నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించే విధంగా సిద్దం చేస్తున్నారు.
ఈనెల 30న వేకువ జామునే సచివాలయ ప్రాంగణంలో రహదారులు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సుదర్శన యాగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పూర్ణాహుతి సమయానికి సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తారు. మధ్యాహ్నం 1:20 గంటల నుంచి 1:33 గంటల మధ్య సింహలగ్న ముహూర్తంలో కేసీఆర్ తన సీట్లో ఆసీనులవుతారు. తర్వాత మంత్రులు, అధికారులు తమ సీట్లలో కూర్చుంటారు. మధ్యాహ్నం 1:58 గంటల నుంచి 2:04 గంటల మధ్య కార్యదర్శులు, అధికారులు వారి వారి సీట్లలో కూర్చొని ఏదో ఒక దస్త్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది.