తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Employees Fitment: ఏపీ సీఎం చేతికి సీఎస్ కమిటీ సిఫార్సులు.. 14.29% ఫిట్​మెంట్! - new prc latest news

AP Employees Fitment: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఫిట్‌మెంట్‌ 14.29% ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడింది.

AP Employees Fitment
సీఎస్ కమిటీ సిఫార్సులు

By

Published : Dec 14, 2021, 9:05 AM IST

AP Employees Fitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నగదు ప్రయోజనం 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. ఫిట్‌మెంట్‌ 14.29% ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. ఇంటి అద్దె భత్యం విషయంలోనూ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు నడుచుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలివచ్చిన ఉద్యోగులకు 30% అద్దె భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది. ఇంటి అద్దె భత్యం తగ్గింపుతో కొందరు ఉద్యోగులు ఇప్పుడు అందుకుంటున్న మొత్తం వేతనం కన్నా కొత్త వేతనం తగ్గే ప్రమాదం ఉందని భావించింది. అలా జరగకుండా వారి పాత వేతనానికి రక్షణ కల్పించాలని సిఫార్సు చేసింది. ఇందుకోసం కోతపడే మొత్తాన్ని పర్సనల్‌ పే రూపంలో ఇవ్వాలని సూచించింది. సిటీ కాంపెన్సేటరీ భత్యం ఇక చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. పెన్షనర్లకు అదనపు మొత్తం భత్యం ఇప్పుడు 70 ఏళ్లకే ఇస్తున్నారు. ఇకపై 80 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ అదనపు భత్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇక ముందు రాష్ట్ర వేతన సవరణ కమిషన్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని- కేంద్ర వేతన సవరణ కమిషన్‌ సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ వేతన సవరణ చేపట్టాలని సూచించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆ దోవలో వెళ్తున్నాయంది. ప్రజా రవాణా ఉద్యోగులకు, హోం గార్డులకు కూడా కమిటీ సిఫార్సులు చేసింది. కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేళ్లను నిర్ణయించింది.

ఫిట్‌మెంట్‌ ఇలా నిర్ణయించాం...

‘‘11 వేతన సవరణ సంఘం తాను లెక్కించిన గణాంకాల ప్రకారం 23% ఫిట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందని భావించింది. ఇప్పటికే మధ్యంతర భృతి రూపంలో 27% ఇస్తున్నందున ఆ మేరకు అదే మొత్తం ఫిట్‌మెంట్‌గా ఇవ్వాలని సిఫార్సు చేసింది. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు 82% ఫిట్‌మెంట్‌ పొందారు. అదే సమయంలో కేంద్ర ఉద్యోగులు 14.29% మాత్రమే అందుకున్నారు. అందుకే కేంద్ర వేతన సవరణ కమిషన్‌ సూచించిన 14.29 ఫిట్‌మెంట్‌ను మాత్రమే మేం ఏపీ ఉద్యోగులకు అమలు చేయాలని సిఫార్సు చేస్తున్నాం’’ అని సీఎస్‌ కమిటీ స్పష్టం చేసింది.

  • ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘాన్ని అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం 2018లో నియమించింది. కిందటి ఏడాది అక్టోబరులో ఈ సంఘం ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికను అధ్యయనం చేసి అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర మంత్రిమండలికి అవసరమైన సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సమావేశమై, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అన్నీ సమీక్షించి ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి తన నివేదికను ముఖ్యమంత్రి జగన్‌కు అందించింది.

సిఫార్సుల్లో కొన్ని ముఖ్యాంశాలు...

  • మూలవేతనం 32 గ్రేడులు, 83 స్టేజిలు. కనీస వేతనం రూ.20,000, గరిష్ఠ వేతనం రూ.1,79,000.
  • 11వ వేతన సవరణ కమిషన్‌ 23% ఫిట్‌మెంట్‌ లెక్కల ప్రకారం ఖరారు చేసింది. ఇప్పటికే 27% మధ్యంతర భృతి ఇస్తున్నందున అదే మొత్తానికి (27%) సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీఎస్‌ కమిటీ ఏడో కేంద్ర వేతన సవరణ సిఫార్సుల ప్రకారం 14.29% ఫిట్‌మెంట్‌ ఇస్తే చాలని పేర్కొంది.
  • ఇంటి అద్దె భత్యాన్ని పీఆర్‌సీ కమిటీ 12% నుంచి 30% వరకు వివిధ కేటగిరీల్లో సిఫార్సు చేసే సీఎస్‌ కమిటీ అంత అవసరం లేదంది. 8% నుంచి 24% వరకు వివిధ నగరాలకు, పట్టణాల్లో ఉద్యోగులకు సిఫార్సు చేసింది.
  • అదనపు విద్యార్హతలకు అదనపు భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.
  • బోధనేతర విద్యా సిబ్బందికి 5 రోజుల అదనపు సీఎల్‌కు సిఫార్సు.
  • పిల్లల సంరక్షణకు మూడు దశల్లో 180 రోజుల సెలవుకు అనుమతి. ఒంటరి పురుషులకు కూడా ఈ సెలవు వర్తింపజేయనున్నారు.
  • ప్రతి ఏటా ఆరోగ్య చికిత్సలు పెన్షనర్లకు వారి జీవిత భాగస్వాములకు వర్తింపు.
  • సర్వీసు పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకు నెలకు రూ.500 ఆరోగ్య భత్యం చెల్లింపు.
  • అంత్యక్రియలకు సాయం రూ.20 వేలకు పెంపు.
  • ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.2,500 వరకు తిరిగి చెల్లింపు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఇది వర్తింపు.
  • ఇంతకుముందు 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ ఇచ్చే వారు. ఇప్పుడది 80 ఏళ్ల నుంచి వర్తింపజేయాలని సీఎస్‌ కమిటీ సిఫార్సు.
  • అదనపు పెన్షన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్లాబులను పరిగణనలోకి తీసుకున్నందున 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసు పెన్షనర్లకు మొత్తం పెన్షన్‌ (గ్రాస్‌ పెన్షన్‌) తగ్గే ప్రమాదం ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు పొందుతున్న మొత్తం పెన్షన్‌కు రక్షణ కల్పించాలి. ఆ తగ్గే మొత్తాన్ని పర్సనల్‌ పెన్షన్‌గా ఇవ్వాలని సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసింది.
  • కాంట్రాక్టు ఉద్యోగులకు, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు, కాంటింజెంట్‌ ఉద్యోగులకు కనీస వేతనం రూ.20,000తోపాటు కరవు భత్యం కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
  • హోం గార్డుల కోసం 11వ వేతన సవరణ కమిటీ సిఫార్సులను సీఎస్‌ కమిటీ తిరస్కరించింది. హోంగార్డులకు వేతనం నిర్ధారించే అంశం వేతన సవరణ కమిటీ పరిధిలో లేదంది. ఇప్పటికే వారికి గత రెండు మూడేళ్లలో 77.5% రోజు వారీ విధి భత్యం పెంచినందున ఇక వారికి ఎలాంటి పెంపు అవసరం లేదని సీఎస్‌ కమిటీ పేర్కొంది.
  • ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతూ సిఫార్సు చేసింది.

ఇదీ చదవండి:CBSE English Paper Controversy: వివాదాస్పద ప్రశ్న తొలగించిన సీబీఎస్‌ఈ

ABOUT THE AUTHOR

...view details