ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఎస్ఈసీతో సమావేశం కన్నా ముందుగా ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. కొవిడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందని ..ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ తేల్చి చెప్పారు.
ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు.. ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ ఎస్ఈసీ చేస్తున్న వాదనలను అంగీకరించబోమని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రాసిన లేఖకు సమాధానంగా ...సీఎస్ లేఖను సంధించారు. కొవిడ్ పరిస్థితుల రీత్యా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని మాత్రమే సర్కారు చెబుతోందని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం అధికారులంతా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు వాయిదా వేస్తోందన్న ఎస్ఈసీ ఆరోపణలను ఆయన ఖండించారు. ఏపీ ప్రభుత్వం స్వార్థపూరితంగా ఎన్నికలను వాయిదా వేస్తుందనడం చింతించదగిన విషయమని ఎస్ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అధికారిక సంప్రదింపుల్లో రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నవారిని ప్రస్తావించడం సరైనది కాదని సీఎస్ స్పష్టం చేశారు.
ఏపీ హైకోర్టు ఆదేశించిన ప్రకారం మూడు రోజుల్లోనే ఎస్ఈసీకి అధికారులు సమాచారం పంపించారని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్ఈసీ కూడా నిర్దేశిత గడువును ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులంతా నిమగ్నమై ఉన్నారని.. ప్రత్యేకించి ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులంతా తొలివిడతలో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన జాబితాలో ఉన్నట్లు సీఎస్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే .. కమిషన్ సూచించిన తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని సీఎస్ తెలిపారు.
- ఇదీ చదవండి:భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్