గాంధీ భవన్లో సందడే సందడి... హైదరాబాద్‌లోని గాంధీ భవన్ నాయకులతో సందడిగా మారింది. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకునే నాయకులతోపాటు వివిధ కమిటీల సమావేశాలు ఉండడంతో కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎన్నిల్లో పోటీ చేసేందుకు రెండో రోజున వంద మందికిపైగా ఆశావహులు దరఖాస్తులు చేశారు. ప్రధానంగా మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ నియోజకవర్గాల్లో ఒక్కో స్థానం నుంచి పదికి పైగా అర్జీలు వచ్చాయి. ఇవాళ దరఖాస్తు చేసిన వారిలో ప్రముఖులు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రులు శంకర్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భిక్షమయ్య గౌడ్, మృత్యుంజయ, మానవతా రాయ్, చిత్తరంజన్ దాస్ తదితరులు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంతో పాటు ప్రచారకమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు జరిగాయి. విజయశాంతి అధ్యక్షతన జరిగిన పీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని స్థాయిల నాయకులను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని తీర్మానించారు. ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోకసభ నియోజకవర్గాల వారీగా మీడియా సమన్వయకర్తలను, జిల్లాకు ఒక మీడియా కన్వీనర్‌ను నియమించాలన్నారు. గాంధీభవన్‌లో రోజుకు రెండు సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.