తెలంగాణ

telangana

ETV Bharat / state

మహాశివరాత్రి వేళ రద్దీగా పండ్ల మార్కెట్లు... కాస్తా పెరిగిన ధరలు! - Mahashivaratri effect on fruit market

భాగ్యనగరానికి మహా శివరాత్రి కళ వచ్చింది. పండుగ నేపథ్యంలో జంట నగరాలకు పండ్లు, పూల దిగుమతులు భారీగా పెరగడంతో... అదే స్థాయిలో అమ్మకాలు సాగుతోన్నాయి. పండ్లు టోకు విక్రయాలకు అడ్డాలైన గడ్డిఅన్నారం సహా గుడిమల్కాపూర్, జాంబాగ్‌, ఎర్రగడ్డ, ఇతర చిల్లర మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో మహా శివరాత్రి వేడుకలు దృష్ట్యా... పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉపవాసం, జాగారం సమయంలో తప్పనిసరిగా ద్రాక్ష, పుచ్చ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, అరటి, యాపిల్... ఇలా ఏ పండు తీసుకున్నా సరే ధరలు రెట్టింపవడం పట్ల కొనుగోలుదారులు పెదవి విరిచారు.

fruits
fruits

By

Published : Mar 10, 2021, 10:39 PM IST

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకుంది. హైదరాబాద్‌ జంట నగరాల్లో ప్రధాన పండ్ల మార్కెట్లన్నీ జనం రద్దీతో కళకళలాడుతున్నాయి. వనస్థలిపురం, కొత్తపేట, రామంతపూర్‌, ఉప్పల్‌, గుడిమల్కాపూర్, జాంబాగ్, మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో విక్రయాలు సందడి సందడిగా సాగుతోన్నాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు పండ్లు కొనుగోలు చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. అయితే... టోకు, చిల్లర మార్కెట్‌లో పండ్ల ధరలు మండిపోవడంతో వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

మహాశివరాత్రి వేళ రద్దీగా పండ్ల మార్కెట్లు... కాస్తా పెరిగిన ధరలు!

రెట్టింపు ధరలు

ద్రాక్ష, యాపిల్, పుచ్చ, మామిడి, కర్భూజ, బొప్పాయి, సపోటా, మొరంగడ్డ, పైనాపిల్, జామ, దానిమ్మ, బత్తాయి, కినో బత్తాయి, డ్రాగన్‌ ఫ్రూట్, వాటర్ యాపిల్, కివీ, కర్జూర, అరటి, ఇతర పండ్ల ధరలు రెట్టింపు కావడంతో... తప్పనిసరై కూడా కొనుగోలు చేసుకుంటూ వెళ్లడం చూస్తే కరోనా ప్రభావం కనిపించినట్లైంది. తమ ఇంటి అవసరాలతోపాటు పూజా కార్యక్రమాలు, ఉపవాసం, జాగారం కోసం సరిపడా పూర్తి స్థాయిలో పండ్లు కొనుగోలు చేయాల్సిన వినియోగదారులు అందులో సగమే తీసుకుని వెళ్తుండటం కనిపించింది. ఇక పూజా సామగ్రి, పూలు అదనం అని చెప్పవచ్చు. వేసవి ఎండల తీవ్రత మొదలైన నేపథ్యంలో గత రెండు, మూడు రోజులతో పోల్చితే... మహాశివరాత్రి వేళ మార్కెట్‌లో వ్యాపారులు కృత్రిమంగా పండ్ల ధరలు ఇష్టానుసారం రెట్టింపు చేసి అమ్ముతున్నారని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంత ఖర్చైనా

నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్‌లో పప్పుదినుసులతోపాటు మహాశివునికి నైవేథ్యంగా సమర్పించే పండ్ల ధరలకు రెక్కలు రావడం పట్ల వినియోగదారులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌లెస్ ద్రాక్ష తీసుకుంటే నిన్న మొన్న కిలో ధర 50 నుంచి 60 రూపాయలు ఉంటే... ఇప్పుడు 80 నుంచి 90 రూపాయలు పైగా పలుకుతోంది. నల్ల ద్రాక్ష తీసుకుంటే కిలో ధర 100 ఉండేది... తాజాగా ఏకంగా 200 రూపాయలు చొప్పున విక్రయస్తున్నారు. సిమ్లా, జమ్మూకశ్మీర్ యాపిల్ ఒక్కొక్కటి 40 రూపాయలు పైగా అమ్ముడుపోతోంది. పుచ్చకాయ, కర్భూజ కిలో ధర 20 రూపాయలు పైమాటే. అదే... 5 రూపాయలు ఉండే ఒక నాణ్యమైన బత్తాయి ధర 10 రూపాయలు పైగా పలుకుతోంది. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూడా అదనపు భారం పండ్లపై పడినట్లు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి పండుగ జరుపుకోవాలి కాబట్టి... ఎంత ఖర్చైనా కూడా వెచ్చించి పండ్లు తీసుకుని వెళుతున్నారు.

వ్యాపార వర్గాలు హర్షం

విశిష్ట పండుగ వేళ... శివ భక్తులు ఉపవాస దీక్షలతోపాటు, జాగారాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఉదయం శివాలయానికి వెళ్లి శివుడ్ని దర్శనం చేసుకుని... ఆ తర్వాత ఉపవాస దీక్షలు, పూజా కార్యక్రమాలకు అధికంగా పూలు, పండ్లు ఉపయోగించడం పరిపాటి. పండుగ నేపథ్యంలో ఈసారి నగరానికి పండ్ల దిగుమతి భారీగా పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి 5 వేల మెట్రిక్ టన్నులు వరకు నగరం దిగుమతయ్యాయి. శివరాత్రి పండుగ రోజు అధిక శాతం ఉపవాసం ఉండి ఎక్కువగా పండ్లు ఆరగిస్తుంటారు భక్తులు. రెండు మూడు రోజులు ఎక్కువగా పూజా కార్యక్రమాలు ఉంటున్నందున పండ్ల విక్రయం అధికమే. సాధారణంగా పండుల సమయంలో లాభాల కోసం వ్యూహాత్మకంగా నాలుగైదురోజుల నుంచే నిల్వచేసి తాము ధరలు పెంచి అమ్మడం పరిపాటి అని, ఈసారి దందాబాగుందని వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

మార్కెట్‌లో పండ్లతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు ఏయేటికాయేడు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో కొవిడ్ నుంచి బయటపడ్డామన్న సంతోషంలో ఈసారి భక్తులు మహాశిరాత్రి వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఇక నుంచి మంచి ఆయురాగ్యాలు, సుఖసంతోషాలు జీవితాలు ముందుకు సాగాలని కాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి :శివరాత్రికి సిద్ధమైన రాష్ట్రంలోని ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details