Crowd of Devotees in Temples Across Telangana : నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో పూజలు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. దేవస్థాన బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
బాల రాముడి విగ్రహ ఎంపిక పూర్తి- ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్
మరోవైపు వేములవాడ రాజన్న(Vemulawada) ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి నెలకొంది. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు శివుడికి ప్రీతిపాత్రమైన కోడెలను కట్టేసిన అనంతరం స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోకి భక్తులు తాకిడి కారణంగా గర్భాలయంలోని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఓరుగల్లులోని శ్రీ భద్రకాళి(Bhadrakali) అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు చేస్తున్న నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
Temples Rush Across Telangana :హైదరాబాద్‌లోని పలు ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం వేళ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. పెద్దమ్మ గుడి, టీటీడీ ఆలయం, జగన్నాథ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో కిలోమీటర్‌కు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.