రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామాలుండగా.. వీటిలో దాదాపు 10,000కు పైగా పల్లెలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. వాటిలో 5 కంటే తక్కువ కేసులు నమోదైనవే ఎక్కువ ఉండడం కొంత ఊరట కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన నిర్ధరణ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటే.. 6.1 శాతం పాజిటివ్‌లు ఉన్నట్లు తేలింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల్లో 7.2 శాతం నమోదు కాగా, అత్యల్పంగా నారాయణపేటలో 3.4 శాతంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
- ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో అత్యధికులు (7,920 మంది) జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో 6.3 శాతం పాజిటివ్‌లు కేసులు నమోదయ్యాయి.
- రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 66,750 చొప్పున కొవిడ్ పరీక్షలను చేస్తున్నారు. ఇది జాతీయ సగటు (61,724) కంటే ఎక్కువ.
- ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితుల చేరికలు తగ్గినా.. ఐసీయూ పడకల్లో చేరే వారి సంఖ్య మాత్రం పెద్దగా తగ్గలేదు.
- జులై (15.14 శాతం), ఆగస్టు (17.50 శాతం)తో పోల్చితే సెప్టెంబరు (17.82 శాతం)లో ఐసీయూలో చేరే వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది.