తెలంగాణ

telangana

ETV Bharat / state

Crops Damaged: అకాల వర్షాలకు.. అన్నదాతలు అతలాకుతలం - ఉత్తర తెలంగాణలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు

Crops Damaged Due to Untimely Rains: అకాల వర్షాలు అన్నదాతల ఆరుగాల కష్టాన్ని ఆగం చేస్తున్నాయి. పొట్ట దశలో ఉన్న పైరు.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీటిపాలవుతుండటాన్ని చూసి.. రైతన్న గుండె చెరువవుతోంది. రాలిపోతున్న మామిడి కాయలు.. నాశనమవుతున్న కూరగాయలతో ఆశలు అడియాశలవుతున్నాయి. ఊహించని విధంగా ఈదురుగాలులతో విరుచుకుపడుతున్న వర్షాలతో రాష్ట్రంలో వారం రోజులుగా కర్షకులు కకావికలమవుతున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 25, 2023, 7:10 PM IST

Updated : Apr 25, 2023, 7:18 PM IST

అకాల వర్షాలకు అన్నదాతలు అతలాకుతలం

Crops Damaged Due to Untimely Rains: ఉత్తర తెలంగాణలో మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వేల ఎకరాల్లో పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. పంటపొలాల్లో చేతికొచ్చిన దశలో కురుస్తున్న వానలతో వరిధాన్యం నేలరాలిపోయింది. ఓ వైపు కల్లాల్లో పోసిన కుప్పలు, మరోవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసిపోవటంతో.. నిస్సహాయ స్థితిలో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు సైతం అందుబాటులో లేకపోవటంతో కళ్లముందే కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండ్రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్లవానతో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, లింగాలఘనపురం మండలాల్లో కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర, గోపాలరావుపేటలో కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.

నిల్వచేసిన ధాన్యం వర్షార్పణం: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. తూకం మొదలుకాకపోవటంతో నిల్వచేసిన ధాన్యం వర్షార్పణమైంది. అటు ఇందూరులోనూ అకాల వర్షం ఆగం చేసింది. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వర్షానికి ధాన్యం తడిచి ముద్దవటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డిచ్‌పల్లి, మోపాల్, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో భారీగా వర్షం కురిసింది. జక్రాన్ పల్లి మండలంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది.

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు: ఇందల్వాయి, డిచ్​పల్లి, మోపాల్ మండలాల్లో వర్షపు నీటిలో ధాన్యం తడిచిపోయింది. వర్షం వస్తే వరిధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు కూడా లేకపోవడంతో ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్ మండలాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షార్పణమైంది. భీంగల్ మండలం ముచుకుర్, భీంగల్, బడా భీంగల్, బెజ్జోరాతో పాటు పలు గ్రామాల్లో నీటి ప్రవాహంలో ధాన్యం కొట్టుకుపోయింది. ఒక్కసారిగా పిడిగులాగా పడిన వర్షానికి అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ప్రభుత్వంపై పోరాడాలి:వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు మద్దతు నిలిచి.. వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై పోరాడాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, కిసాన్ మోర్చా నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నష్టపోయిన రైతులను ఆదుకుని, కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు కరీంనగర్ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను కలిశారు.

రాగల మూడు రోజులు వర్షాలు: వినతీపత్రం అందించే క్రమంలో రైతు గోడు వినండంటూ.. పార్టీ నేత పత్తి కృష్ణారెడ్డి కలెక్టర్‌ కాళ్లు పట్టుకున్నారు. దీనికి అభ్యంతరం తెలిపిన పాలనాధికారి.. తాము ఇప్పటికే సర్వే ప్రారంభించామని కాళ్లు పట్టుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రాగల మూడ్రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు.. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినటంతో క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:Crop Damage : గాలివాన బీభత్సం.. 67 వేల ఎకరాల్లో పంట నష్టం

'పాక్​తో సంబంధాలు అసాధ్యం'.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Apr 25, 2023, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details