తెలంగాణ

telangana

నీట మునిగిన 8.7 లక్షల ఎకరాలు.. పంటనష్టం రూ.1,500 కోట్లు

రాష్ట్రంలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో పెద్దఎత్తున పంటలు నీటమునిగి రైతులు అపారంగా నష్టపోయారు. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులకు రైతులు చెపుతున్నారు. మండల స్థాయి వ్యవసాయాధికారులు ఇప్పటికే నీటమునిగిన పంటల విస్తీర్ణం వివరాలను నమోదు చేశారు.

By

Published : Oct 15, 2020, 6:46 AM IST

Published : Oct 15, 2020, 6:46 AM IST

Crop loss due to heavy rains in the telangana is Rs 1,500 crore
Crop loss due to heavy rains in the telangana is Rs 1,500 crore

రాష్ట్రంలో ప్రాథమిక అంచనాల ప్రకారం 8.68 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని జిల్లా అధికారులు అనధికారికంగా తెలిపారు. ఎకరానికి సగటున రూ.20 వేల చొప్పున నష్టాన్ని లెక్కించినా రూ.1,500 కోట్లకుపైగా పంటను రైతులు కోల్పోయినట్లుగా రైతుసంఘాలు తెలిపాయి. అత్యధికంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 2.81 లక్షల ఎకరాల పంటలు పాడయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వరి, పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి.

కొద్ది గంటల వ్యవధిలోనే 10 నుంచి 30 సెంటీమీటర్ల వరకూ కురిసిన కుంభవృష్టి వర్షాలకు తట్టుకోలేక పైర్లు నేలవాలాయి. జూన్‌ నుంచి సాగుచేసిన పలు పంటలు ఇప్పుడు పూత, కాత దశల నుంచి కోతకు వచ్చే స్థాయిలో ఉన్నాయి. పత్తికాయలు వర్షాలకు నల్లబడుతున్నాయి. దూది వచ్చిన చోట పాడయింది. వరిపైరు పొట్టదశలో నీటమునిగి నేలవాలడంతో గింజ సరిగా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయశాఖ అధికారికంగా పంట నష్టాల వివరాలను విడుదల చేయలేదు. పొలాల్లో చేరిన నీరంతా బయటికి వెళ్లిపోతే పంటనష్టం తగ్గుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పంటల బీమా పథకం లేకపోవడంతో రైతులకు పరిహారం వచ్చే అవకాశాలు లేవు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గత జులై నుంచి సెప్టెంబరు వరకూ కురిసిన అధిక వర్షాల వల్ల ఇప్పటికే 4 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగిన సంగతి తెలిసిందే.

మొక్కలను నిలబెట్టండి

వర్షాలకు నీటమునిగిన పంటల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ సూచించారు. అవి..‘‘పొలాల్లో చేరిన నీటిని త్వరగా బయటికి పంపాలి. నేలవాలిన మొక్కలను లేపి నిలబెట్టి వాటి మొదళ్లలో మట్టివేసి సరిచేయాలి. వర్షాలకు పత్తిలో ఆకుమచ్చ తెగులు వృద్ధి చెందుతోంది. దీంతో పత్తికాయలు కుళ్లిపోకుండా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 30 గ్రాములను 10 లీటర్ల నీటిలో చొప్పున కలిపి 7 రోజుల వ్యవధిలో 2, 3 సార్లు చల్లాలి. వరికి కాటుక, మానుకాయ తెగుళ్లు సోకుతున్నాయి. నివారణకు చర్యలు తీసుకోవాలి’’అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details