Crop Loss in Telangana : అకాల వర్షాలు.. రైతులను నట్టేట ముంచాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు 63 వేల ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతిన్నది. 20 ఎకరాలలో మామిడి, కూరగాయలు, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఎకరా వరి సాగుకు రూ.25 వేలు ఖర్చు కాగా.. పంట చేతికందే సమయంలో వడగండ్ల వాన రావడంతో జిల్లాలో పంట పూర్తిగా నేలపాలైంది. పది రోజుల పాటు అకాల వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురిశాయి. జిల్లాలోని సగానికిపైగా గ్రామాల్లో వడగండ్ల వానకి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పంటలు చేతికిరాని పరిస్థితి. ముందుగా వరి కోసిన రైతులను.. కష్టాలు వెన్నాడుతున్నాయి. ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోయిగా.. అకాల వర్షానికి తడిసిముద్దై మొలకలు వస్తున్నాయి. జిల్లాలో రైతులకు రైస్ మిల్లర్ల రూపంలో మరో ఇబ్బంది ఎదురవుతోంది. తడిసిన ధాన్యాన్ని దించుకోవడానికి మిల్లర్లు ఇష్టపడటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో లేదంటే, రైస్ మిల్లుల వద్ద ధాన్యంతో రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికే వర్షాలతో సగం నష్టపోయామని.. ఇప్పుడు కొనుగోళ్లలో జాప్యంతో మరింత నష్టం జరగకుండా చూడాలని కామారెడ్డి జిల్లా రైతులు కోరుతున్నారు.
రైతులకు అండగా: ప్రభుత్వ అనుబంధ కొనుగోలు కేంద్రాల్లోనే.. మక్కలు అమ్మాలని రైతులకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేశ్ సూచించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని.. ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను పట్టించుకున్న నాయకులు లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎఫ్ బీ సీ మహిళా సంఘం ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలతో.. అన్నదాతలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.