crop loss in telangana:అకాల వర్షాలు... రాష్ట్ర రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వర్షానికి పంట దెబ్బతినడంతో.. మనస్థాపానికి గురైన రైతు గుండెపోటు వచ్చి మృత్యువాతపడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దోమకొండకు చెందిన రైతు తిప్పాపురం కృష్ణమూర్తి... తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు. భారీ వర్షాలకు సాగు చేసిన వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కోత కొయ్యకముందే వరి గింజలన్నీ నేలరాలిపోయాయి. దీంతో రైతు కృష్ణమూర్తి మనస్థాపానికి గురవడంతో.. గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే కామారెడ్డి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందాడు.
Crop Damage in Telangana : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాత అరిగోస పడుతున్నాడు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నెలన్నర రోజుల కిందటే ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నా.. పంటను వెనువెంటనే కొనుగోలు ప్రక్రియ చెపట్టలేదు. మెదక్ జిల్లాలో ధాన్యం మొలకలు వచ్చి 23 వేల మంది రైతులు నష్టపోయారు. కొందరు రైతులు తడిసిన ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టి కుప్పలు పోయక ముందే... అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసా ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి తరచూ ధాన్యం తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయని.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచి.. కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.