రైతులకు పంటరుణాల (Crop Loans) పంపిణీలో తెలంగాణ బాగా వెనుకబడింది. కేరళ, హరియాణా, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలకన్నా చాలా తక్కువగా రైతులకు రుణాలిస్తున్నారు. 2019-20లో హరియాణాలో ఒక్కో రైతు పంట రుణ ఖాతాకు రూ.లక్షన్నర, పంజాబ్‌లో రూ. లక్షా 92 వేలు, కేరళలో రూ. 86,855 చొప్పున సగటున రుణాన్ని బ్యాంకులివ్వగా తెలంగాణలో రూ.70,950 ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదిక (Report of the Central Department of Agriculture)లో వెల్లడించింది. పంట రుణ ఖాతాలు, సొమ్ము పంపిణీ సంఖ్యలను పరిశీలిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరసగా తొలి రెండు అగ్రస్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి దేశంలో అత్యధిక జనాభా 22 కోట్లమంది ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు. కానీ అక్కడ రైతు రుణాల సంఖ్య 91.16 లక్షలే ఉండగా వారికిచ్చిన సొమ్ము రూ.74,368 కోట్లు మాత్రమే. ఉత్తర్‌ప్రదేశ్ జనాభాలో సగం కూడా లేని తమిళనాడులో యూపీకన్నా మరో 94 లక్షల ఖాతాలు అధికంగా ఉన్నాయి. తెలంగాణతో పోలిస్తే తమిళనాడులో మరో 3 రెట్లు అధికంగా సొమ్మును రుణాలుగా రైతులకు పంపిణీ చేశారు. బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జనాభా, రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా రుణాల పంపిణీ చాలా తక్కువగా ఉంది.
రుణమాఫీ ప్రభావంతోనే..
తెలంగాణలో పంట రుణాల పంపిణీ తక్కువగా ఉండటానికి రుణమాఫీ పథకమే ప్రధాన కారణమని వ్యవసాయశాఖ అధికారులతో పాటు బ్యాంకర్లు చెబుతున్నారు. 2018 డిసెంబరు నాటికి రూ.లక్ష లోపు బాకీ ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ అందులో రూ.25,000 లోపు రుణాలనే ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. పైగా ఇవి కూడా 2020 వానాకాలంలో ఇచ్చినవి. రైతులు కొత్త రుణాలు తీసుకోవాలంటే ముందుగా పాత బకాయిలు చెల్లించేయాల్సి ఉంటుంది. కానీ రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో 2019-20లో రైతులు అటు పాతబాకీలూ కట్టలేదు.. ఇటు కొత్త రుణాలనూ తీసుకోలేదనేది బ్యాంకుల వాదన. అందువల్లనే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రుణాల పంపిణీ చాలా తక్కువగా ఉన్నట్లు అంచనా. రూ.25,000కు పైన, రూ.లక్షలోపు బాకీ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడానికి ఇంకా దాదాపు రూ. 27,000 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.