ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోనే 57,500 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 50 వేల ఎకరాల మేర వరి ఉంది. గొల్లప్రోలు, ఏలేశ్వరం, కిర్లంపూడి, పిఠాపురం తదితర మండలాల్లో పంటపొలాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 21 మండలాల పరిధిలో 26 వేల ఎకరాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలు పాడయ్యాయని ప్రాథమిక నివేదికలు రూపొందించారు. పశ్చిమగోదావరి జిల్లా మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, పెదపాడు, తాళ్లపూడి, ఉంగుటూరు, యలమంచిలిలో వేల ఎకరాల్లో వరి, పొగాకు, మినుము పంటలు దెబ్బతిన్నాయి.
విశాఖపట్నం జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 1,500 హెక్టార్లల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. గొడిచెర్ల ప్రాంతంలో 200 ఎకరాల్లో నీట మునిగింది. విజయనగరం చీపురుపల్లి మండలం పుర్రెయవలసలో వరి దెబ్బతినగా, రావివలసలో ఆరబోసిన మొక్కజొన్నకు మొలకలొస్తున్నాయి. పెద్దగడ్డ జలాశయం నుంచి నీటిని విడుదల చేయటంతో సమీపంలోని కర్రివలసలో పంటపొలాలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో పంట పొలాల్లోకి నీళ్లుచేరాయి. కంద, పసుపు, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెదకూరపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో మిరప పొలాలు దెబ్బతిన్నాయి.