ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో వినాయక విగ్రహాల విక్రయాలపై నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రోడ్డులోని ఐడీ ఆసుపత్రి వద్ద కొందరు వినాయక విగ్రహాలు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు.
చెత్తను తరలించే ట్రాక్టర్లో... వినాయక విగ్రహాల తరలింపు - guntur news
ఏపీలోని గుంటూరులో వినాయక ప్రతిమల విక్రయాలపై అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన ప్రతిమలను.. అనుమతి లేదంటూ చెత్త తరలించే వాహనాల్లో అక్కడి నుంచి అధికారులు తీసుకెళ్లారు.
విగ్రహాలను అమ్మడానికి ఇక్కడ పర్మిషన్ లేదంటూ విక్రయదారులకు తెలిపారు. అనంతరం విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. అనుమతి లేదంటూ చెత్త తరలించే ట్రాక్టర్లో.. వినాయక విగ్రహాలను ఉంచి తరలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులతో విగ్రహాలు అమ్ముకునే వారు వాగ్వాదానికి దిగారు. పవిత్రంగా భావించే వినాయక విగ్రహాలను చెత్తను తరలించే వాహనంలో తరలించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తెదేపా నాయకురాలు బొల్లినేని జ్యోతిశ్రీకి మరోసారి సీఐడీ నోటీసులు