Heart Surgeries for Children in Nims Hospital: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్న పిల్లలకు చేపట్టిన క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలు విజయవంతమయ్యాయి. ఇందుకోసం నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం 6 రోజుల పాటు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. బ్రిటన్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ రమణ ధన్నపునేని నేతృత్వంలో 10మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఈ సర్జరీలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మానవీయకోణంలో చిన్నారుల శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
తొలిసారిగా చిన్న పిల్లలకు గుండె సర్జరీ: భవిష్యత్‌లో నిమ్స్ ప్రపంచస్థాయి కార్డియో థొరాసిక్ సర్జరీ కేంద్రంగా మారుతుందని యూకే వైద్యులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్ వైద్య బృందంతో పాటు నిమ్స్ ఇంఛార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి ఈ వర్క్‌షాపులో పాల్గొన్నారు. సాధారణంగా దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో విదేశీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. ఆ తరహాలోనే తొలిసారిగా హైదరాబాద్ నిమ్స్‌లో చిన్న పిల్లలకు గుండె సర్జరీలు నిర్వహించారు.
ప్రాణదానం చేసిన వైద్యులకు ధన్యవాదాలు: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించే ఈ శస్త్ర చికిత్సలను ప్రభుత్వం నిమ్స్‌లో ఉచితంగా చేపట్టింది. ఆపరేషన్ల కోసం పేద కుటుంబాలకు చెందిన చిన్నారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. తమ పిల్లలకు ప్రాణదానం చేసిన వైద్యులు, ప్రభుత్వానికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.