Crimes using Technology in Hyderabad :నేరం చేస్తున్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. పోలీసుల నుంచి తప్పించుకోలేం అన్న భయం ఉంటే ఎవరూ నేరం చేయడానికి ముందుకు రారు. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, క్రైం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అంతర్జాలంలో వస్తున్న సమాచారంతో చాలా మంది నేరం ఎలా చేయడమో కాదు.. నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకుంటున్నారు. మరోవైపు కొన్ని కేసుల విచారణలో నేరస్థులు నిర్భయంగా కొన్ని సంఘటనలను చూసి నేర్చుకున్నాం అని చెబుతున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ.. పోలీసులను తప్పుదారి పట్టించడానికి కొంతమంది నేరస్థులు ప్రయత్నిస్తున్నా.. వారికంటే హై టెక్నాలజీ వినియోగిస్తూ పోలీసులు నేరస్థుల ఆట కట్టిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృష్టిస్తున్న వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ప్రస్తావిస్తున్న.. గూగుల్ టేక్అవుట్, ఐపీడీఆర్ వంటి పదాలు ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Crimes using Technology in telangana : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నిందితులకూ ఉపయోగడుతోంది. నేరం చేయడానికి ప్లాన్ చేసేముందు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయా..? ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి..? అని గమనిస్తున్నారు. వాటి స్పాట్లను బట్టి నేరం ఎక్కడ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. నేరం చేసేటప్పుడు ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్ వాడితే దొరికిపోతామన్న విషయం పసిగట్టేస్తున్నారు. నేరం చేసిన తరువాత వేలిముద్రలు, పాదముద్రలు, ఇతర ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే వారు ఎక్కడ దొరికిపోతారో అని ఆలోచించి కేసును తమ వైపు రాకుండా కృత్రిమ ఆధారాలను సృష్టిస్తున్నారని పోలీసులే చెబుతున్నారు.
బాధితుల ఫోన్ నుంచే క్యాబ్ బుకింగ్ :జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి జొరబడ్డ రాజేష్ యాదవ్.. గర్భిణి మెడపై కత్తిపెట్టి రూ.10 లక్షలు దోచుకున్న ఘటన తెలిసిందే. తెలివిగా బాధితురాలి సెల్‌ఫోన్ నుంచే కారు బుక్ చేయించుకొని షాద్‌నగర్ వెళ్లాడు. దాని ఆధారంగా పోలీసులు పరుగులు పెట్టారు. అక్కడ దుస్తులు కొనుగోలు చేసినట్లు తెలియడంతో పక్క రాష్ట్రానికి ఉడాయిస్తున్నట్లు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మాత్రం హాయిగా దోచుకున్న డబ్బులతో విలాసాలు చేశాడు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ‘ఫ్లయిట్ మోడ్'లో ఉన్న నిందితుడి సెల్‌ఫోన్ ఆచూకీ పట్టుకోగలిగారు. తర్వాత ఆ నంబరు ఎవరిదో తెలుసుకోవడంతో నిందితుడిని పట్టుకోగలిగారు.