ప్రస్తుతం రాజకీయాల్లోకి నేరస్తుల అరంగేట్రం సాధారణంగా మారింది. ఎన్నో రకాల నేరాలు చేసినవారు చివరకు హత్యారోపణలు ఉన్న వారు సైతం ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగు పెడుతుంటే.. రాజకీయాలు, నేరాలు కలగలసిపోయిన ఓ వికృతదృశ్యం కనిపిస్తోంది. చేతులకున్న బేడీలు ఆభరణాలుగా.. తమపై ఉన్న కేసులను ప్రతిష్ఠగా భావిస్తూ దర్జాగా.. చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఉండే ప్రత్యేక హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేరస్తులెవరో అసలైన నిజాయితీపరులు ఎవరో వేరుచేసి చూడలేకపోతున్నాం.
సామాన్యుల విషయంలోనే..
చట్టం తన పనితాను చేసుకుంటూ.. పోతుందని ప్రతి ఒక్కరు చెబుతున్నా.. అది సామాన్యుల విషయంలోనే నిజమవుతోంది. పలుకుబడి గల బడానేతలు మాత్రం చట్టం కళ్లుగప్పుతున్నారు. ఏదైనా ఆరోపణలొస్తే కింది కోర్టు.. పైకోర్టు, ఆ పైన పైకోర్టుల్లో అప్పీళ్లతో నేరస్తులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఫలితంగా చట్టబద్ధపాలన అనేది పుస్తకాల్లో మాత్రమే భద్రంగా ఉంటోంది. రాజ్యాంగ స్ఫూర్తి అమలుకావడం లేదు. అధికారం శాశ్వతం కాదని నేతలకు తెలుసు కాబట్టే తర్వాత రోజుల్లోనూ తమపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చి జైలు పాలైతే ఆ అంశాన్నీ అనుకూలంగా మలచుకుంటున్నారు కొందరు. అంతేకానీ జైలుకు వెళ్లివచ్చినందుకు ఏమాత్రం పశ్చాత్తాపం ప్రదర్శించడం లేదు.
అల్లకల్లోలం..
శాసనకర్తలపై వస్తున్న ఆరోపణలపై మూడేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు. ప్రజలకు బాధ్యులుగా ఉండే వ్యక్తులు నేరాలకు పాల్పడితే మొత్తం వ్యవస్థ అల్లకల్లోలం అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలంటే ప్రత్యేక కోర్టులే శరణ్యమని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల ప్రకారం రెండేళ్ల క్రితం ఫాస్ట్ కోర్టులు ఏర్పాటైనా కేసుల పరిష్కారం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన..
నేరగ్రస్త రాజకీయాలనుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన సుప్రీం ఆదేశాల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తునే ఉన్నాయి. కాని 2 దశాబ్దాలకు పైగా ఆ చొరవ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడంలేదు. నేరచరితులైన నేతలపై గల కేసుల సత్వర విచారణకు 2018లో 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని సిద్ధం చేసినా ఏడాదిలోగా తుదితీర్పులు వెలువడాలన్న లక్ష్యానికి తూట్లు పడ్డాయి. ఆ పరిస్థితిని ఇక ఉపేక్షించరాదన్న సంకల్పంతో రాజకీయనేతలపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేసేలా వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీం ధర్మాసనం తాజాగా ఆదేశించింది.
రోజువారీ విచారణ..
స్టే ఉత్తర్వులు ఉన్న కేసులనూ రోజువారీ విచారణ జరిపి 2 నెలల్లో తేల్చేయాలంది సుప్రీం కోర్టు. 4 వేలమందికి పైనే ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెండింగ్ ఉండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆవేదన వ్యక్తపరిచింది. ఇందులో కొన్నికేసులు 1980 నుంచి పెండింగ్‌లో ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం. క్రిమినల్ కేసుల్లో నేరస్తులుగా రుజువైన వారు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య పెరిగిపోవడం, విచారణ లో ఉన్న కేసులను బలసంపన్నులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.
24 హైకోర్టులకు ఉత్తర్వులు..