పోలీసులు చేపడుతున్న చర్యలు, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాల్లో 10 శాతం తగ్గుదల నమోదైంది. హత్యలు 24 శాతం, హత్యాయత్నాలు 39 శాతం, అపహరణలు 34 శాతం, మోసాలు 35 శాతం, అల్లర్లు, 47 శాతం, దోపిడీలు 62 శాతం, దొంగతనాలు 30 శాతం, గొలుసు దొంగతనాలు 62 శాతం, వాహనాల దొంగతనాలు 22 శాతం, మహిళలపై నేరాలు 19 శాతం, చిన్నారులపై నేరాలు 35 శాతం తగ్గాయి. అంతర్జాతీయ నగరాలైన న్యూయార్క్, లండన్‌తో పోలిస్తే హత్యలు అతి తక్కువగా నమోదయ్యాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. తరచూ మోసాలకు పాల్పడే వాళ్లపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి... మరోసారి నేరాలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
3.6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు
ఈ ఏడాది 123 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 4,660 మంది కరుడు గట్టిన నేరగాళ్లు, 1,600 మంది రౌడీషీటర్ల ఇంటికి పోలీసులు తరచూ వెళ్లి తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 వేల చోట్ల క్రమం తప్పకుండా తనిఖీలు చేపడుతున్నారు. డయల్ 100 కూడా నేరాల అదుపునకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది 2 లక్షలకు పైగా డయల్ 100కు ఫోన్లు వచ్చాయి. ఈ లెక్కన రోజుకు 500పైన ఫోన్లు వచ్చాయి. ఫోన్ వచ్చిన వెంటనే దాదాపు 6 నిమిషాల్లో గస్తీ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంటోంది. సీసీ కెమెరాల వల్ల ఎన్నో కీలకమైన కేసుల్లో పురోగతి సాధించారు. ఇప్పటి వరకు 3.6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దొంగతనాల కేసుల్లోనూ పోలీసుల రికవరీ శాతం 70 శాతం వరకు ఉంది.
మతఘర్షణలు చోటుచేసుకోకుండా
ఈ ఏడాది ఎలాంటి మతఘర్షణలు చోటుచేసుకోకుండా చూడటంలో పోలీసులు సఫలమయ్యారు. గణపతి ఉత్సవాలు, మొహర్రం ఊరేగింపు, రంజాన్‌తోపాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడా గొడవలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు. రహదారి ప్రమాదాలు 34 శాతం తగ్గి.. మరణాల్లోనూ 17 శాతం తగ్గుదల నమోదైంది. 1,738 ప్రమాదాలు చోటుచేసుకోగా 237 మంది మృతి చెందారు. వాహనాలు ఢీకొనడం వల్ల 474 మంది పాదచారులకు గాయాలు కాగా.. 68 మంది చనిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 54 లక్షల మందిపై కేసులు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించిన 5,591 మందిపై కేసు నమోదు చేసి.... న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ. 5.2 కోట్ల జరిమానా వసూలు చేశారు.