తెలంగాణ

telangana

ETV Bharat / state

Amaravathi Land Mortgaged for Loan : అమరావతి రాజధానిలో 480 ఎకరాలు తనఖా ?.. కొత్త రుణం కోసమా ? - అమరావతి భూముల తనఖా

Amaravathi Land Mortgaged for Loan : ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినట్టు సమాచారం. శనివారం మందడంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసినట్టు తెలిసింది. సీఆర్‌డీఏ తీసుకుంటోంది పూర్తిగా కొత్త రుణమా?. లేదా గతంలో హడ్కో రుణం కోసం తనఖా పెట్టిన భూమిని ఇప్పుడు ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కోసం కేటాయించినందున దాన్ని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా మరో భూమిని తనఖా పెట్టిందా? అన్నది తెలియాల్సి ఉంది.

Amaravathi Land Mortgaged for Loan
Amaravathi Land Mortgaged for Loan

By

Published : Feb 7, 2022, 10:06 AM IST

అమరావతి రాజధానిలో 480 ఎకరాలు తనఖా ?.. కొత్త రుణం కోసమా ?

Amaravathi Lands: ఏపీ రాజధాని అమరావతిలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం మందడంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసినట్టు తెలిసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేసినప్పటికీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించినట్టు సమాచారం. అనంతవరం, మందడం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో రైతులు భూసమీకరణలో ఇచ్చిన భూమిలో సీఆర్‌డీఏ వాటాకు వచ్చిన భూమిలో కొంత బ్యాంకులకు తనఖా పెట్టినట్టు తెలిసింది. రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఈ భూమిని బ్యాంకులకు తనఖా పెట్టినట్టు తెలుస్తోంది.

అయితే ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్నారు? ఏ అవసరానికి తీసుకుంటున్నారు? అన్న విషయంలో స్పష్టత లేదు. వివరాల కోసం సీఆర్‌డీఏ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులోకి రాలేదు. రిజిస్ట్రేషన్‌ జరిగింది వాస్తవమేనని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ధ్రువీకరిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల నుంచి రాజధానిలో ప్రస్తుతం స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువల వివరాలను తెప్పించుకున్నట్టు తెలిసింది. బ్యాంకులకు తనఖా పెట్టిన భూముల్లో సర్వేచేసి మార్కింగ్‌ కూడా చేశారని సమాచారం.

ఇప్పుడు సీఆర్‌డీఏ తీసుకుంటోంది పూర్తిగా కొత్త రుణమా? లేదా గతంలో హడ్కో రుణం కోసం తనఖా పెట్టిన భూమిని ఇప్పుడు ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కోసం కేటాయించినందున దాన్ని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా మరో భూమిని తనఖా పెట్టిందా? అన్నది తెలియాల్సి ఉంది.

  • రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కుదించి తొలిదశలో రూ.3 వేల కోట్లతో పనులు చేపడతామని ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. దానికి సంబంధించి సీఆర్‌డీఏ ఒక డీపీఆర్‌ సిద్ధం చేయించి గత నెల 9న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంటామని తెలిపింది. రుణం తీసుకున్న మూడో సంవత్సరం నుంచి రాజధానిలోని 481 ఎకరాలను దశలవారీగా 15ఏళ్లపాటు విక్రయించి తీసుకున్న రుణాన్ని తీర్చేస్తామని డీపీఆర్‌లో పేర్కొంది. మూడో సంవత్సరంలో రాజధానిలో భూమి విలువ ఎకరం రూ.7 కోట్లు ఉంటుందని.. 17వ సంవత్సరంలో ఎకరం విలువ సుమారు రూ.17.74 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. బ్యాంకుల నుంచి ఆ రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకు గ్యారంటీనిస్తూ ప్రభుత్వం లోగడే జీవోనిచ్చింది. ఇప్పుడు ఈ రూ.3 వేల కోట్ల రుణానికే సీఆర్‌డీఏ భూమి తనఖా పెట్టిందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
  • రాజధాని నిర్మాణానికి గతంలో సీఆర్‌డీఏకు హడ్కో రూ.1,250 కోట్ల రుణమిచ్చింది. దాని కోసం అప్పట్లో మంగళగిరి సమీపంలోని నవులూరులో గతంలో వీఎంఆర్‌డీఏ ఉన్నప్పుడు లేఅవుట్లు వేసేందుకు సేకరించిన భూమిని సీఆర్‌డీఏ తనఖా పెట్టింది. ఇప్పుడు అదే భూమిలో మధ్యతరగతివర్గాల కోసం ఎంఐజీ లేఅవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఆ భూమిని తనఖా నుంచి విడిపించాలంటే దానిపై హడ్కో రుణమైనా చెల్లించాలి? లేదా ప్రత్నామ్నాయ భూమినైనా చూపించాలి? ఇప్పుడు రాజధాని గ్రామాల్లోని భూమిని హడ్కోకే సీఆర్‌డీఏ రిజిస్ట్రేషన్‌ చేసిందన్న అభిప్రాయమూ ఉంది. ఏ అవసరం కోసం రాజధాని గ్రామాల్లోని భూమిని తనఖా పెట్టారన్న అంశంలో అధికారుల నుంచి స్పష్టత రాలేదు.

ఇదీ చూడండి :Theft at Temple in Sirpur : గుడిలో చోరీ.. విగ్రహాలు, హుండీలో సొత్తు అపహరణ

ABOUT THE AUTHOR

...view details