Diwali festival in telangana: రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ... దీపావళి కోలాహలం నెలకొంది . చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకుంటున్నారు . చిన్నా, పెద్ద వెలుగుల ఉత్సవాన్ని ఆస్వాదిస్తున్నారు . టపాసుల కొనుగోళ్లతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. అందరి ఇళ్లల్లో కొత్త కాంతులు విరజిమ్మాలని అందరూ నూతన ఉత్సాహంతో దీపావళిని జరుపుకుంటున్నారు. కానీ టపాయలు పేలుళ్లు మాత్రం అప్పుడే పేలుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో టపాకాయల సందడి.. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో టపాసుల అమ్మకానికి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఘటన దృష్ట్యా అగ్నిమాపక శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది టపాసుల ధరలు భారీగా పెరిగాయని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. చాలా ఎక్కువ ధరలు చెప్పి..డిస్కౌంట్ పేరుతో డబ్బులు దండుకున్నారని వాపోయారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు బాగా పెరిగాయని ప్రజలు తెలిపారు.
హనుమకొండలో మునుపెన్నడు లేని విధంగా ఉన్న ధరలు.. హనుమకొండలో బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నగంలోని పలు ప్రాంతంతో టపాసుల దుకాణాలు విరివిగా వెలిశాయి. గతేడాది కంటే ఈసారి ధరలు 50 శాతం పెరిగాయని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ధరల మోతతో కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. సంచులకొద్దీ కొనేవారు సైతం అరసంచికే పరిమితమయ్యారు. ఈ సంవత్సరం తీసుకున్న టపాయలు మునుపెన్నడూ లేని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి.
పాలమూరులో దద్దరిల్లిన బాణాసంచా వెలలు.. పాలమూరులో బాణాసంచా దుకాణాలు కొనుగోళ్ల సందడి లేక వెలవెలబోయాయి. కరోనా ప్రభావం తర్వాత పండగ ఉత్సాహం అంతగా కనిపించడం లేదు. బాణసంచా ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల జనం బెంబెలెత్తిపోతున్నారు . చిచ్చుబుడ్లు, రాకెట్లు, భూచక్రాలు థౌసండ్ వాలా లాంటి టపాసుల ధరలు గతేడాది పోల్చితే 50శాతం మేర పెరిగాయి. గతేడాది వెయ్యి రూపాయల్లో కొనుగోలు చేసిన టపాసులకు ఇప్పడు 3 వేల వరకూ పెట్టాల్సి వస్తోందని వినియోగదారులు అంటున్నారు. కాల్చకముందే ధరలు పేలిపోతున్నాయని, రాకెట్ల కంటే వేగంగా ఆకాశంలోకి దూసుకువెళ్లాయని వాపోతున్నారు. గ్రహణం కారణంగా దీపాలు పెట్టాల వద్దా అన్న మీమాంసలో జనం పడిపోవడంతో కొనుగోలు చేయడం లేదని తయారీ దారులు అంటున్నారు. గత సంవత్సరం రూ. 300గా ఉన్న చించుబుడ్డి ప్యాకెట్లు ఇప్పుడు1200 రూపాయలు పలికిందని కొనుగోలుదారులు తెలిపారు.