CPM Supports Trs in Munugode By Elections: మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. మునుగోడు ఎన్నిక వరకే తెరాసకు మద్దతు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గానికి తెరాస పార్టీ వల్ల అన్యాయం జరిగితే.. కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామా వల్ల మునుగోడు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తమ్మినేని పేర్కొనారు. మునుగోడులో భాజపాను గెలిపిస్తే నెల రోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారని.. పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీతో బెదిరింపులకు భాజపా పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆక్షేపించారు.
రాబోయే ఎన్నికలు తెరాస వర్సెస్ కాంగ్రెస్‌గా మారే అవకాశముందన్నారు. కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు భాజపా ప్రణాళికలు వేస్తోందన్నారు. సీపీఐలా తాము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదని.. మునుగోడు ఉప ఎన్నిక వరకే తెరాసకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు.
"కనీస ప్రజాస్వామ్యం లేదు. మోదీ, అమిత్‌షా మీద ఏదైనా పోస్ట్ పెడితే రాజద్రోహం నేరం కింద చట్టాలు తీసుకువచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భాజపా ఇక్కడ గెలవనీయకూడదు. గతంలో ఐదు సార్లు మునుగోడులో సీపీఐ గెలిచిన సీటు. సీపీఐతో సంప్రదింపులు జరిపాం. మనం పోటీచేయడం వల్ల భాజపా వ్యతిరేకతను చీల్చినట్టు అవుతుంది తప్ప భాజపాను ఓడించే పరిస్థితి లేదు. అందుకే తెరాసకు మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది." -తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి