ఒకట్రెండు రోజుల్లో నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి ప్రకటన ఉంటుందని కేటీఆర్ ప్రకటించడాన్ని సీపీఎం ఆహ్వానించింది. అధ్యయనం, రాష్ట్రాల సందర్శన పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.
ఆశించిన స్థాయిలో లేవు..
రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతున్నదని.. 2018 ఎన్నికల సభల్లో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిని తమ మేనిఫెస్టోలో చేర్చారని గుర్తు చేశారు. రెండేళ్లు గడిచినప్పటికీ ఆ హామీ నెరవేరలేదని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగవకాశాలు ఆశించిన స్థాయిలో లేవని.. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలకు భారం అతున్నారని పేర్కొన్నారు.
కేంద్రం మాట నిలబెట్టుకోలేదు..
ఇప్పటికే 11 లక్షల మంది ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లో తమ పేర్లు నమోదు చేసుకోగా, మరో 9 లక్షల మంది నమోదు చేసుకోకుండా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేంద్రం తెచ్చిన నోట్లరద్దు, జీఎస్‌టీ, కొవిడ్‌లతో చిన్నపరిశ్రమల మూత పడటం, తదితర కారణాల వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోయి.. అనేక మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా గంపెడాశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 5వేల నిరుద్యోగ భృతిని ప్రకటించి, కాలయాపన చేయకుండా వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష