కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. మోదీ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా ధరలు పెంచడంతో ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్షణమే కేంద్రం విధిస్తున్న సెస్, తదితర పన్నులను రద్దు చేసి... వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత 11 రోజుల్లోనే వంటగ్యాస్ ధరను రూ. 75లు పెంచడంతో సిలెండర్ ధర రూ. 821.50కు చేరుకుందని తమ్మినేని అన్నారు. ఓ వైపు పేద మహిళలకిచ్చే ఉజ్వల గ్యాస్ పథకానికి లబ్ధిదారులను పెంచుతామని కేంద్రం ప్రకటిస్తూనే... మరోవైపు పేదలకు అందుబాటులో లేని విధంగా ధరలను పెంచడాన్ని ఆయన తప్పు పట్టారు.