దేశంలో కొవిడ్ రెండో దశ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వమే కారణమని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఆరోపించారు. 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో భాగంగా... భాజపా, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో... దాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం విఫలమైంది...
ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉచితంగా ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సింది పోయి ధరలు నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా కొవిడ్ కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లను, పీఎం కేర్ ఫండ్స్ కింద సేకరించిన వేల కోట్లను... కరోనాను అరికట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వాలకు కేటాయించాలని రాఘవులు డిమాండ్ చేశారు.