రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కల్లోలం సృష్టిస్తోందని.. నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శులతో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తమ్మినేని సమావేశం నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.
గందరగోళంగా పరిస్థితులు
రాష్ట్ర వ్యాప్తంగా పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందులు, కిట్స్, టీకాల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారని తమ్మినేని పేర్కొన్నారు. టీకాల విషయంలో వైద్యారోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళంగా మారిందని ఆరోపించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం వద్ద పరీక్షలు, వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరి నిరాశతో వెనుతిరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.