గగన్‌పహాడ్ జాతీయ రహదారిపై విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటికీ తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. జాతీయ రహదారిపై నుంచి బెంగళూరు, అనంతపూర్, కర్నూల్, ఎయిర్‌పోర్టుకు రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గగన్‌పహాడ్ వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులను చాడ పరామర్శించారు. రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్‌లో వరదల వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించడం లేదని చాడ విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.