తెలంగాణ

telangana

ETV Bharat / state

'బీజేపీ హఠావో.. దేశ్ ​కో బచావో' నినాదంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు: కూనంనేని - కవితపై ఈడీ దాడులను తప్పుపట్టిన కూనంనేని

CPI bjp hatavo desh bachavo protests: "బీజేపీ హఠావో.. దేశ్​కో బచావో" నినాదంతో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశ, రాష్ట్ర సమస్యలను సమ్మిళితం చేస్తూ వచ్చే నెల 14 నుంచి పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Koonanneni Sambasivarao
Koonanneni Sambasivarao

By

Published : Mar 10, 2023, 6:41 PM IST

CPI bjp hatavo desh bachavo protests: హైదరాబాద్​లోని హిమాయత్‌నగర్‌లో గల సీపీఐ ప్రధాన కార్యాలయంలో ఇవాళ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, కేంద్ర కమిటీ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, పార్టీ నేతలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు తీసుకోవాల్సిన తొమ్మిది అంశాలను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.

అనంతరం మాట్లాడిన కూనంనేని ఎమ్మెల్సీ కవిత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాలపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడులు చేయడాన్ని తప్పుపట్టారు. "తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే కానీ.. కేవలం ప్రతిపక్ష పార్టీలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం ఏంటని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంస్థలన్నింటినీ అదానీకి అంకింతం చేస్తున్నారని ఆరోపించారు.

పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన అదానీపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే నెల 14 నుంచి దేశ, రాష్ట్ర సమస్యలను సమ్మిళితం చేస్తూ.. "బీజేపీ హఠావో.. దేశ్​కో బచావో" అనే నినాదంతో దేశవ్యాప్తంగా పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

"బీజేపీ హఠావో-దేశ్​కో బచావో అనే నినాదంతో ఏప్రిల్​ 14 నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై మా పోరాటం ఉంటుంది. గతంలో క్యాబినెట్ తీసుకున్న​ నిర్ణయాలు నిన్న మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు కొంత వ్యత్యాసం ఉంది. పోడు భూముల పంపిణీపై గతంలో చెప్పిన లెక్కలు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల్లో కొద్దిగా తేడా ఉంది. ధరణిలో లోపాలు సరిదిద్దాలి. ఇంటి స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవన్నీ రాష్ట్ర సమస్యలు. ఇకపోతే దేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను భయపెడుతోంది. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. కానీ ప్రతిపక్ష నాయకులే తప్పులు చేస్తున్నారా..? అధికార పక్షం వాళ్లు తప్పులు చేయడం లేదా..? అదానీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే గానీ మీరు సెబీతో కమిటీ వేయలేదు. దిల్లీలో ఆప్​ను ఓడించడం చేతకాక.. సిసోదియాను అరెస్టు చేశారు. ఇక్కడ కేసీఆర్​.. బీజేపీని ప్రశ్నిస్తున్నారని కవితపై ఈడీ దాడులు చేస్తున్నారు."- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details