హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీ గుడిసెవాసులు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఇక్కడ 13 వేల కుటుంబాలు 25 ఏళ్లుగా నివసిస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం గిరిజన కుటుంబాలే. ప్రభుత్వం మురికివాడలు, బస్తీల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తోంది. కాని సింగరేణి గుడిసెల్లో కోర్టు తీర్పు సాకుతో మంచినీటి కనెక్షన్లు ఇవ్వకపోవటంతో జలమండలి ఉచిత ట్యాంకర్లే వారికి దిక్కుగా మారాయి.
నల్లా కనెక్షన్లు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి గుడిసెలకు రూపాయికే మంచి నీటి కనెక్షన్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. నీరు లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైశాలినగర్ రిజర్వాయర్ నుంచి సింగరేణి గుడిసెవాసులకు నిత్యం 100-120 ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటి సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ.10 నుంచి రూ. 12 లక్షలు ట్యాంకర్ల యజమానులకు జలమండలి అధికారులు చెల్లిస్తున్నారు. రూ.20 లక్షల వ్యయంతో గుడిసెల ప్రాంతంలో తాగునీటి కనెక్షన్లు ఇస్తే మంచినీటి సమస్య తీరుతుంది. కాని ఆదిశగా చర్యలు తీసుకోకుండా. కోర్టు తీర్పు సాకుతో నీటి కనెక్షన్లు ఇవ్వకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండి:KTR:'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'