వరద బాధితులను ఆదుకోవడం... సహాయ కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు. సాయం కోసం దీనంగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని ఓల్డ్ కమేలా బస్తీలో భారీ వర్షాలకు ఇళ్ళు కూలిపోయి... నిరాశ్రయులుగా మారిన పేద ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు.
'పట్టించుకోవడం లేదు'
మూడు రోజుల నుంచి సుమారు 60 మంది బాధితులు కట్టుబట్టలతో బస్తీలోని చిన్న కమ్యూనిటీ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు భోజనం, మంచి నీరు వంటి కనీస వసతులూ కల్పించడం లేదని ఆరోపించారు. నిధులు విడుదల చేసినా ఫంక్షన్ హాళ్లు అద్దెకు తీసుకొని బాధితులకు ఎందుకు ఆశ్రయం కల్పించడం లేదని ప్రశ్నించారు. వర్షాలతో పూర్తిగా ఇళ్ళు కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.