సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది అక్టోబర్ 14 నుంచి 18వరకు ఏపీలోని విజయవాడలో జరగనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ప్రకటించారు. మహాసభలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉండగా కొవిడ్ నేపథ్యంలో నిర్వహించలేకపోయామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అంశాలను మహాసభల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు.
'' కేంద్రమంత్రి కుమారుడు రైతుల మీదకు కాన్వాయ్‌తో దూసుకుపోయి చంపేశాడు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు రైతులే తన కుమారుడిని చంపడానికి వచ్చారని కేంద్రమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. కార్లతో రైతులను చంపించి... నేరం తన మీదకు రాకుండా కేంద్రం చూసుకుంటుంది. దేశంలో డ్రగ్స్ విచ్చలవిడిగా విస్తరిస్తోంది. మాదక ద్రవ్యాలను సేవించే వాళ్లనే కాదు.. తయారు చేసే వాళ్లను సైతం పట్టుకోవాలి. సినీనటులను కాదు డ్రగ్స్‌లో ఆధాని లాంటి వాళ్లను పట్టుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది. ఇండియన్ ఎయిర్ లైన్స్‌ను టాటాకి అప్పగించారు. సుప్రీంకోర్టు చెప్పినా 25ఏ ను కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదు. క్షణం కూడా మోదీకి దేశ ప్రధానిగా ఉండే అర్హత లేదు.
-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana)
విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు కాకుండా 100 శాతం ఫిజికల్‌గా అటెండ్ అయ్యేలా క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. రాజీవ్ స్వగృహకల్పని అమ్మకానికి పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నారాయణ మండిపడ్డారు. ఇది అమ్మితే మీ నాన్నని అమ్మినట్టే అంటూ వ్యాఖ్యానించారు.