CPI Narayana Fires BRS : బీఆర్ఎన్ నుంచి కాంగ్రెస్ వైపు అనుకూల పవనాలు మళ్లడానికి కారణం కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియమాకాలు అమలు చేయకపోవడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతకాలేదని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ.. వాయిదాలతో తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గేట్లు కొట్టుకుపోయింది చూశామన్న ఆయన.. పునాదులు కొట్టుకుపోయింది చూడలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రతి ప్రాజెక్టులో 30 శాతం తీసుకుంటున్నారని.. అందుకే రాష్ట్రంలో ప్రాజెక్టుల నాణ్యత తగ్గుతుందని ఆరోపించారు.
CPI Narayana on Governor System : 'రాష్ట్రాల పాలనలో గవర్నర్ల జోక్యం పెరిగిపోతోంది'
ప్రతి ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఇవ్వాల్సిందేనని నారాయణ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఇవ్వకపోతే ప్రాజెక్టులు పూర్తి కావని మండిపడ్డారు. 15 ఎకరాలతో ఫామ్ హౌస్ కట్టుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక 250 ఎకరాల వరకు కబ్జా చేశారని ఆరోపించారు.కేసీఆర్ కుటుంబానికి కాలిగోటి నుంచి తలవెంట్రుక వరకు అహంభావం ఉందని దుయ్యబట్టారు. అహంభావమే బీఆర్ఎస్ సర్కారును ఓడిస్తుందని అన్నారు.
CPI Narayana Comments on Telangana Politics : లిక్కర్ కేసులో వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ముద్దాయిలేనని నారాయణ ఆరోపించారు. ఈ కేసులో అరెస్టు కాకుండా.. జగన్, కేసీఆర్, నరేంద్ర మోదీ, అమిత్ షాతో రాజీపడ్డారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసే ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నాయన్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేసే రోజు వారి ఇంట్లో ఐటీ దాడులు చేశారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో గెలిచే బలమైన నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో బీసీలు బీఆర్ఎస్ నుంచి విడిపోయి.. కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వైపు బీసీలు వెళ్లకుండా.. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిందన్నారు. బీజేపీ బీసీ, మైనార్టీ, దళిత వ్యతిరేక పార్టీ అని పేర్కొన్నారు. అందుకే మాదిగ ఉపకూలల విశ్వరూప మహాసభలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పకుండా.. కమిటీ వేస్తామని మోదీ ప్రకటించారని తెలిపారు. కేంద్రంలో అధికారం కోల్పోతామని వారికి అర్థమైందని.. అందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.