CPI on Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వ్యవసాయానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలిసి నారాయణ.. మీడియా సమావేశం నిర్వహించారు.
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ ఉందని సీపీఐ విమర్శ వాళ్లకు అన్యాయం
విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్రం ఆహ్వానిస్తోందన్న నారాయణ.. వాటిలో సామాన్యులకు రిజర్వేషన్లు అందుబాటులో ఉండవని విమర్శించారు. విద్యా, వైద్యానికి సరైన కేటాయింపులు జరగలేదని దుయ్యబట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీల మీద ఒక్క శాతం పన్ను విధిస్తే దేశంలోని సమస్యలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన దాడిపట్ల సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు.
"బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదు. బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నా.. కానీ రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు. రాజ్యాంగాన్ని మార్చాలని భాజపా చూస్తోంది. చట్టబద్ధమైన వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ ఉచ్చులో ప్రజలు పడకూడదు." - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
జీవో 317 తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే దానిని సవరించాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పరస్పర బదిలీల్లో పాత సర్వీసులు కోల్పోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వరంగల్‌కు వెళ్తానన్న ముఖ్యమంత్రి.. మంత్రులను పంపించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.
"బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుండు సున్నా చూపించింది. మనపట్ల కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఎన్ని సార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం." - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చదవండి:'రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు'