జీవో నంబర్లు 58, 59 ద్వారా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ, సాదా బైనామాలకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించడం పట్ల సీపీఐ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఉచితంగా మ్యుటేషన్ చేయాలనే నిర్ణయం కూడా మంచిదేనని అభిప్రాయపడింది. అన్ని వ్యవసాయ భూములు, ఆస్తుల వివరాలను ఆన్లైన్ చేసి... ధరణిలో ఉంచే ప్రక్రియను జాగ్రత్తగా చేసేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హర్షం - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రెడ్డి తాజా వార్తలు
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉచితంగా క్రమబద్ధీకరణ, సాదా బైనామాలకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించడం మంచి విషయమన్నారు.
పేద, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగితే తక్షణ పరిష్కారానికి కాల్సెంటర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆన్ లైన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మిగులు, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయనే ఆధారంగా, రాష్ట్రంలో అవసరమున్న ప్రజలకు వ్యవసాయ భూములు, నివాస స్థలాల పంపిణీతో పాటు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు.
అటవీ భూములు, భూదానోద్యమ భూములకు నిర్ధిష్ట కాలపరిమితితో పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన చెరువు, కుంట శిఖరములు, వక్ఫ్, దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.